పాల్కడలి తూగుచూ ఆడేటి పసిడి – కడలి చిలుకగ చింది చిగురించెనమ్మా!
ముచ్చటగు ఆ ఇంతి ఇందీవరాక్షి – మెచ్చి మాధవు జేరు తీరు రుచిగనరే!
పొంగు చిందుల సందు మెరుపల్లె మెరిసి – అలల నురుగుల నలిగి కన్నె కనువిప్పె,
ఉయ్యాల జంపాల ఆడు అలలందు – అమిత గారవ మొంది ఇంతి పెరిగేను
||పాల్కడలి తూగుచూ ||
పాల బుగ్గల నిగ్గు తరిగి తొలగంగా – పడుచు వన్నెలు చిందె చెక్కిళ్ళలోనా,
కంటి రూపును జూసి కలువ రూపొందె – కురుల జాడలు జూచి తుమ్మెదలు మొలిచె
||పాల్కడలి తూగుచూ ||
పరువమందగ పొంగె పాలిండ్లు జతగా – జఘనమందెను వంపు సొంపుగమరంగా
నడుమ నలిగిన నడుము మూడు ముడుతలతో – నింగి పోలికలంది నిలకడొందేను
||పాల్కడలి తూగుచూ||
జగతి పున్నెము పండ మొలచినా మొలకా – మంగళాంగిగ పెరిగె పాల సంద్రమున,
లావణ్యములు మెచ్చు లలిత శోభలతో – కళ్యాన ఘడియకై తరుణి నిలిచేను
||పాల్కడలి తూగుచూ||
సిరులు కురిసే తల్లి నా ఇంటి పాప – వరుని గూడెడి తరుణ ముదయించెనంచు,
ముని వరుల రావించి వివరములనెరిగి – మంచి కాలము నెంచి క్షీరసాగరుడు
||పాల్కడలి తూగుచూ||
తరుణు లందరు గూడి అత్తరుల నద్ది – నలుగు నున్నగ బెట్థి జలకమాడించి,
సాంబ్రాణి ధూపంబు కురులంత నింపి – ముదురు చందన గంధ మద్దిరంగనకు
||పాల్కడలి తూగుచూ||
మయుడు దెచ్చెను మంచి ముత్యాల పీట – మందాకినిని దెచ్చె కరి రాజ రాజు
మణి కింకుణుల మాల దెచ్చె ధేనువులు – దేవాంగనలు దెచ్చి రగరు అత్తరులు
||పాల్కడలి తూగుచూ||
పద్మభవుడందించె స్వేత కమలంబు – శ్రీవాణి దీవించె నగుమోము కళను ,
ముక్కంటి ముదమార ధ్యాన రీతొసగె – వామాంగి అందుంచె కరుణ కంజమును
||పాల్కడలి తూగుచూ||
దేవతలు కిన్నెరలు యక్ష పరిజనులు – మణులు మానిక్యాల మాలలిచ్చేరు,
నందనంబున పండు విరులన్ని అల్లి – దేవేంద్రుడందించె వైజయింతికను
||పాల్కడలి తూగుచూ||
పలుకు పచ్చలబొమ్మ పగడాల రెమ్మా – పూర్ణ చంద్రిక వెలుగు సుకుమారి కలిక,
వరమాల చేబూని కదలగా జూసి – ఆనంద ముప్పొంగ సాగరుడు దెలిపె !
||పాల్కడలి తూగుచూ||
శాశ్వతుండగు వాడు శాంతికాముకుడు – పూర్ణ శేషము లందు కలిగుండువాడు,
కారణంబగు వాడు కార్యమగువాడు – కార్యకారణ కామ్య రూపమగువాడు,
కలిగి యుండిన యంత కలిగుండువాడు – కొల్ల లందున పొల్లు కలిమైనవాడు,
నడయాడు జగమెల్ల నడయాడు వాడు – తొలగి జగముల నెల్ల ఆడించువాడు,
ఆడి అలసిన వాని తెరవైన వాడు – అలుపు బాపెడి తెరవు తానెయగువాడు,
తలచి జగముల తొల్లి తరలించువాడు – మాపు తలపును మాపి తొలగించువాడు,
కలిమి బలిమియు కలుగు కారణము వాడు – కరువు కలిగిన కూడ కలిగుండువాడు
కంటి వెలుగుయు వాడు కన్నుయునువాడు – కాంచు మోహమువాడు కాంచునది వాడు,
మాయయై మోహమును రగిలించు వాడు – మోహమై పురమెల్ల పాలించువాడు ,
మచ్చికెరుగని మోహపాశమగువాడు – శరణన్న చెరబాపి శమమిచ్చు వాడు,
గుణగణంబులు వాడు – గుణము లెరుగనివాడు – గణనకందని గుణశేఖరుడువాడు,
గానలోలుడు వాడు – గానంబుయును వాడు – పలుతీరు నాదించు గళమైనవాడు,
పలుకు భావమువాడు – పలుకైనవాడు – పలుకు పలుకున పలుకు పలుకైనవాడు,
వేడుకొందెడివాడు – వేదనొందెడివాడు – వేడుకకు వేదనకు వెలియైనవాడు
వన్నెలన్నియు వాడు – వన్నెలెరుగని వాడు – వన్నెలకు వన్నెగా వెలుగొందువాడు,
సవ్యాపసవచయముల సారించు వాడు – సాధుజన మానసపు సంసారి వాడు
శమ దమంబుల సీమ నెరిగించువాడు – సీమ లెరుగని సీమ కలిగున్నవాడు
కలికి కలుగునుగాక నీకు సరి జతగా – జగము మెచ్చగ నీదు మనసు మురియంగా !
||పాల్కడలి తూగుచూ||
కన్నదెవరో గాని పెరిగినానిచటనే – పెను మురిపముల నే నాడినానిచటే,
తల్లితండ్రియునైన సాగరుండితడు – ఎరిగించు గుణరాసి నెన్నగా గలనా?
అనియంచు యోచించి ఇందీవరాక్షి – లోచనంబులు మూసి మౌనమొందేను,
అతులితుండగువాడు ఆత్మానుభవుడు కనికరంబున కనుల పొడగట్టు గాకా!
||పాల్కడలి తూగుచూ||
తరుణి తలచిన తీరు తమకమొందింప -తరలె తామస హరుడు తరుణి ముంగిటికి
తళుకు చుక్కల బాట హెచ్చరిక కాగ – వెడలె వైభవమొంద వైఘాన విభుడు!
||పాల్కడలి తూగుచూ||
ఆజాను బాహుండు అరవింద నేత్రుండు – ఆనంద సాగరము నేలువాడు,
అంబుజోదరుడతడు అవని గాచినవాడు – అంభోరుహాక్షుండు ఆత్మభవుడు,
నీల మేఘపు మేని ఛాయగలిగిన వాడు – లోచనంబుల నగవు లోలుకువాడు,
కస్తూరి తిలకంబు కలుగు ఫాలమువాడు – కామితార్ధము లిచ్చు చూపువాడు,
పట్టు పీతాంబరము కటిన అమరినవాడు – ఉరముపై కౌస్తుభము కలుగు వాడు ,
ఫాలాక్షు శిరమంది ధరణి పాపముబాపు – గంగ బుట్టిన పుణ్యపదము వాడు,
పున్నెముల పంటగా పరమపురుషులు దలచు పసినగవు నొలకించు మోమువాడు,
మునులు ఋషిపుంగవులు మన్నించి మన్నించి సన్నుతింపగ తరలు శౌరివాడు,
శంఖ చక్రాదిగా ముక్కోటి దేవతల నుతుల నందుచు తరలి చేరెనచట !
||పాల్కడలి తూగుచూ||
మోహనాకారుడని పదుగురాడగ వింటి – మోహమే రూపైన రేడువీడు,
రంగునలుపేగాని నునుశోభగలవాడు – రాజిల్లు రాజీవ మోమువాడు,
నింగి నీలముపైన మెరయు చంద్రిక వంటి – తెట తెల్లని తీపి నవ్వువాడు,
మాయకవ్వలి వాడు మనసెరుడనుకొంటి – మన్ననెరిగిన మనసు కలుగువాడు ,
పూర్ణకాముడు వాడు కామింపతగువాడు – పూర్ణపుషుడు వీడు పుణ్యధనుడు,
విద్యలన్నిటి విద్య వివరమెరిగిన వాడు – పలుకనేర్వని పలుకు లెరుగువాడు,
విదితపరుపగ రాని విన్నపంబులు తెలిసి -మానధనులను గాచు ధీరుడితడు
వందారు మందార వనవాసి యగువాడు – వాసవాదులు గొల్చు వేల్పువీడు
కామరూపుడు వీడు రూపమొందెను నేడు – వీడకుందును వీని ఎడద నిండి,
పాదపంకజ సేవ పలుమారు నే జేతు – ఋషి గణంబులు కొలిచి కమిలినపుడు
కారణంబేదైన కరుణగొనుటే చాలు – వైజయంతిని గొనగ వేడుకొందు!
||పాల్కడలి తూగుచూ||
నల్ల కలువను జేరు శశి కిరణమల్లే – నళినాక్షు దరిజేరె నెలత శ్రీలక్ష్మీ,
వరద విన్నపమంది మన్నింప దలచి – వాసుదేవుడు వంగె వనిత మురియంగా!
(వరద – పెళ్ళిగాని పిల్ల) ||పాల్కడలి తూగుచూ||
ఇంద్రమణి హారములు ఘనమంది మెరయ – వైజయంతమరేను విభుని యదపైన
ఇందిరా విభుడంచు జెయము పలుకంగా – దేవాంగనలు దివ్య నాట్యములు సలుప
దివ్య పుష్పపువృష్టి వేడుకమరంగా – దిక్కులన్నియు దివ్య దుందుభులు మ్రోగా,
సిరి నేడు సగమాయె దేవదేవునకు – శ్రీరస్తు యను సురలు దీవెనొసగేరు
శ్రీవత్స మై నిలచి విభును గొలవంగా – పాల్కడలి విడినాడి తరలె శ్రీలక్ష్మి
||పాల్కడలి తూగుచూ||