మాధవా – మరుగేలరా

మాధవా మధుసుధనా – మరుగేలరా ? నను గావగా!
దూరమా ? నను జేరగా – పెను భారమా ? నను గావగా!

వింత లోకపు వీధిలో విధి విధించిన దారిలో,
వివరమేదని ఎరుగజాలని వివశ వేదన నెన్నవా?
గగన సీమల నగరులే – నిజ వాసమై వసియింతువా?
వసుధ నేలెడి దేవరా – వసివాడె నీ పురి కానరా!
మాధవా మధుసుధనా – మరుగేలరా ? నను గావగా!
దూరమా ? నను జేరగా – పెను భారమా ? నను గావగా!

అదితి సంతును గావగా – మోయలేదా నాడు మంధర!
సురరాజు గర్వము తుంచగా – గొడుగుగా గిరి నందలేదా!
అంత భారము మించునా – నా కర్మభారము – గిరిధరా!
మాధవా మధుసుధనా – మరుగేలరా ? నను గావగా!
దూరమా ? నను జేరగా – పెను భారమా ? నను గావగా!

నటనశాలల పాఠశాలలు నేటితోనిక ముగియునంచు,
సూర్యనందనుడంపెనంచు – అరిగిరే ఈ కాల దూతలు,
తుంచి దేహము తరలు వేళన – తోడు నీయకె నుందువా!
మాధవా మధుసుధనా – మరుగేలరా ? నను గావగా!
దూరమా ? నను జేరగా – పెను భారమా ? నను గావగా!

దురిత దూరుడవంచు పలువురు పొగడగా నే వింటినే,
ధరణి వేదన వెడలజేయగ – వేలరూపలు గొంటివే!
ధూళికన్నా పిన్ననగునను బ్రోవ యోచన ఏలయా?
మాధవా మధుసుధనా – మరుగేలరా ? నను గావగా!
దూరమా ? నను జేరగా – పెను భారమా ? నను గావగా!

యోచనల ఆ లోచనంబున కదలు వాడని యందురే!
లోచనెరుగని యోచనలు నీ జాడనెంచగ నెరుగవే!
నేరభారము దీర్చినన్నిక దరిజేర్చ యోచన ఏలయా?
మాధవా మధుసుధనా – మరుగేలరా ? నను గావగా!
దూరమా ? నను జేరగా – పెను భారమా ? నను గావగా!

Leave a comment