వస్తాడిక వనరాజని వనివేచిన వేళలోన,
గిరికన్నియ కంటి వెలుగు అరుదెంచెను ఎందుకో!
కరుణన వని కనగలడా రతి వల్లభ హారీ,
కారణ కామ్యపు రూపుడు కామాంతక శూలి!
జగముల నేలెడి వాడని పొగడగ పనిలేదు,
జాగేలిక దయగనుమని వేడగ వినబోడు,
జంగమ దేవర వినుమని విన్నపమిడినంతే,
జంభారికి తగు వసతులు ఇంపుగ నందించు!
మిన్నగువానికి పట్టము ముదమున గట్టంగా,
తీరగు పోరును తనయుల తలపడుమని దెలుప,
దిక్కని వేడిన బుడుతకు వేదము నెరిగించి,
మెప్పించిన మహనీయుని మహిమేమని యందు!
అన్నుల మిన్నగు సుందరి ఏలగ రమ్మనగా,
ఎరుకల వేషముగట్టుక హేయపు గతి మెదలా,
మోహపు మునుకల మనిగెడి ముదితకు తా నొగ్గి,
దేహపు భాగము నిచ్చిన దేవుని ఏమని అందు!
కమ్మని పాలను చిలుకగ చిమ్మిన విషమును మింగగ,
దితి దనుజుల వైరులెల్ల వెరపున వేడగ బోగా,
వెలియగు విసమును పండుగ వైనంబున చేతబట్టి,
గళమందున నిలిపినట్టి – నిటలాక్షుని ఏమందు!
చెదిరిన రోహిణి విభునకు వేడుకయౌ పదవినిచ్చి,
గంగను జుట్టిన కొప్పున ఇంపుగ నుంచిన వానిని,
గగనాంతర పురమునుండి ధరణికి దూకిన గంగకు,
తలపట్టిన తామసహరు – తమకము నేమందు!
నాటికి నేటికి మేటిగ మోదము నొసగెడివానిని,
ఏటికి ఇట కేగితివని ఏమని నే నందు!
నందుని నందను నందను నగుబాటును గావుమంచు
వేడెడి వనముల వేదన – వెలి యెంచగ తగునా!
వేడెదనా మదహారిని – వేడెదనా రిపు వైరిని,
వేడెదనా ఖలుమర్దను – వేడెదనా ఫణిభూషణు,
వేడెదనా శశి మౌళిని – వేడెదనా ఫాలాక్షుని,
వెన్నెల నాడెడి రాయని జంటగ నిట నేల!