భావ భావం

వస్తాయని వసంతాలు వేచిన కోయిల అలువదు,
వస్తాడని రేరాయడు వేచెడి కలువలు అలువవు,
వస్తాడని గోపాలుడు వేచెడి గోవులు అలువవు,
గొల్లల కేలో తొందర గోవిందుని దారి గాయ!

విరిబంతులు వివరించవు విరిసిన కారణమేమని,
మది పొంగెడి మధురూహల విందుల వైభవమేమని,
పొందుగ నందుని నందను నందను డాడగ రాడని
వేగిర పడి వేసారవు వేకువ జత విడనాడవు!

విచ్చిన కలువల కన్నులు వెలుగులు జల్లక మానవు,
తారా నాయకు నలజడి తలపున నిలుపక మానవు,
కోటికి మించిన కరముల తాకిడి తనువందకున్నా,
కొలువుగ కోనేట నిలచి విందులు పంచక మానవు!

వేసారవు వెలియేమని వెలితిగ నెంచవు తమగతి,
వెలసెడితనువుల రాలుచు ఎంచును రంగని పదమని,
పదిలంబగు పధమందిన పరవశ భావన నెంచుచు,
పంకజ నాభుని పంచకు పరుగున జన తరి ఇదెయని!

తాపము దీరక బెంగన తపియించెడి పవనంబులు,
తరలని గ్రీష్ష్ముని కఠినత ఓరిమి మీరగ నోపుచు,
చినుకుల చేలము గట్టెడి అంబుద సేవలు జేయగ ,
కడలిన ఆడెడి చుక్కల రెక్కల మోయుచు నాడును!

గగనపు వీధుల దేలుచు దేవేంద్రుని సేవించుచు,
ధరణీ పతి ఛాయనంది తనువుల తేజము నింపుచు,
తారామండల శోభను హారంబుగ ధరియించుచు,
తిరిగెడి మబ్బులు త్వరపడి కరివల్లభు పదమంటవు!

నందుని నందను సంగమ మందిన గొల్లల సందడి,
సంధ్యల నడుమన జతగా వెన్నాడుచు వేడుకొంద,
మానిని రాధికా వల్లభు మెల్లని అడుగులు తోడుగ,
అడుగుల నల్లగ నెంచుచు అడుగాడక వెనుకాడునా!

రతివల్లభు మద హారిని మది నెంచెడి సురవైరిని,
తలుపక తరలెడి దారులు తరుగని ఎరిగున్నా,
విధి నడిపెడి పెడదారులె నందాత్మజు శాసనమని,
ఎంచుచు నెమ్మది నొందుచు నరకాంతకు గనరే!

నరులుగ నడచెడి గోపకు లందని తీరుల గైకొని,
నగవుల నగముల నందుచు నడయాడెడి వనివాసులు,
మదినెంచెడి మధురూహను మన్నించెడి మతినొందగ,
గోపీవల్లభు సంగమ మమరంబై ధర నేలద!

Leave a comment