వీడని తోడు

పట్టి చేయిక విడువ నెన్నకు – పట్ట నా కింకెవరు రా!                                                              పన్నగాసన పదిల పరచగ – పరుల వేడగ నెంతునా!
పట్టి చేయిక విడువ నెన్నకు – పట్ట నా కింకెవరు రా!

పెంచి మోహము ద్రుంచ తగునా – పాలసంద్రపు ఏలికా!
మరలుటెరుగని మనసు పగ్గము – పట్టి నీ దరి జేర్చుమా!
పట్టి చేయిక విడువ కెన్నడు – పట్ట నా కింకెవరురా!

తరుగు ఆయువు పెరుగు వయసని ఎరిగి చిందులు ఎందుకో,
తరలి నీ పురి కరుగు తరుణము చేర వేడుక నెంతునో!
పట్టి చేయిక విడువ కెన్నడు – పట్ట నా కింకెవరురా!

కంటి వెలుగులు వెలసి పోయెను – వెలసె ఈ పురి వన్నెలూ,
వెన్నెలందలి చలువ నెంచటి చేవ తనువున తరిగెరా!
పట్టి చేయిక విడువ కెన్నడు – పట్ట నా కింకెవరురా!

నాడు నీ జత వీడినానని – చిన్నబోవుట చెల్లునా,
వెడలి నీ సతి ఒడిన జేరితి- నీదు ఊహల మసలగా!
పట్టి చేయిక విడువ కెన్నడు – పట్ట నా కింకెవరురా!

ఒంటివానిగ నాడచి అలసితి – తోడు వీడకు నగధరా!
నగవు పంచెడి తోడువై నా జంట నుండర గిరిధరా!
పట్టి చేయిక విడువ కెన్నడు – పట్ట నా కింకెవరురా!

Leave a comment