వనమాలీ గిరిధారి – హరి -వనమాలీ గిరిధారి,
హరియింపవె నా భవ భారము దయగని,
వనమాలీ గిరిధారి….
హాలా హలమును హరునికి పంచిన,
హరమానస సంచారీ!
వనమాలీ గిరిధారీ – హరి – వనమాలీ గిరిధారీ!
వేడుక మీరగ గొల్లల జోడుగ – గోవుల గాచిన లీలా విగ్రహ ధారీ!
వెన్నలు పంచగ ఎంచిన బాలురు – పంచిన ఆ ఫలమేమీ?
హరీ – వనమాలీ గిరిధారీ ……..
చల్లలు చిలికెడి పడుచుల మనసుల – హరియించిన ఓ గొల్లల బాలా!
పంచిరి ఏమని ఎంచితివా మది – ముంతెడు వెన్నకు అంతటి ఫలమా?
హరీ – వనమాలీ గిరిధారీ ….
విసమును చిలికిన పన్నగ రాయని – పదముద్రలతో బ్రోచిన శౌరివి!
పర కంటకమౌ పన్నగ మేమని – పొగడెనొ గాదా నీ దయ నొందగ!
హరీ – వనమాలీ గిరిధారీ!
లీలల మాలలు లాలిగ పాడెడి – నందుని కాంతకు నందను డైతివి,
గొల్లల నేలెడి పల్లెల పడుచుకు – యోగము నొసగిన యోచన ఏదో!
హరీ – వనమాలీ గిరిధారీ…
గడిచిన గాధలె గానముగా గొని – మన్నన నందిరి మునివరులంతా,
తీరుగ నీ కధ పాడగ ఎరుగను – పలికిన తీరునే మన్నింపుమురా!
హరీ – వనమాలీ గిరిధారీ…
హరియింపవె నా భవ భారము దయగొని,
వనమాలీ గిరిధారీ… హరీ – వనమాలీ గిరిధారి!