వెన్ను గాచెడివాడు వెన్నఁడు వెంటుండ,
కడలి బుట్టిన మందు కుడియ నెంచి,
చేజారినా ముంత చేవచే గొనలేక ,
కుమిలి ఖిన్నత నొంది విభుని జేరి,
మోటువారగు వారు మోమాటమేలేక,
అంది కలశము నంత వెడలిరంచు,
హరమానసోల్లాసి పదపంకజము జేరి,
వెలితెరుంగక హరిని వేడుకొనిరి!
దితి సంతు వేడుకల ఊరేగుచుండగా,
అదితి సంతరిగేరు అమరు సన్నిధికి!
దితి యైన అదితైన ముని సంతుయగు మూక,
వెన్ను గాచెడి వాని మహిమ గనరైరి!
కోరి పాదము బట్ట కాదనగ లేనట్టి,
కరుణ కాసారంబు కాంతాయె నాడు
సిరి మెచ్చు సుందరుండింతిగా నడయాడి
వైరులందర ముంచె మోహమందు!
గోవిందు రూపమే విందాయె అసురులకు,
మిత్తి మాపెడి మందు మరచి రపుడు,
వేడు వారల గాచి వేడుకొందెడి వాడు,
అమరమౌ ఆ మందు సురల కొసగె!
లీలా వినోదుండు తోడుండ వలెగాని,
వెరపు మాపగ తరమె అన్యమునకు,
అంది ఆతని తోడు సుధనొంది సురలెల్ల,
అమర వాసము నొంది అతని గొలిచె!
ఎరుగరే జనులెల్ల మితి లేని మందేదొ,
కడలి బుట్టిన ముంత లోనుంది కాదంచు,
కమలాక్షు కరమంటి పంచి ఇచ్చుట చేత,
చింత చెల్లగ జేసి చేరదీసె!