రంగు రంగుల జగతి రంగు వెలియక మునుపె,
శ్రీరంగ నీ జాడ నెరిగించ రారా
రస హీనమై జగతి రాగమందుటె మరచె,
రస రాజమైనట్టి నామ మీరాద!
రంగు రంగుల జగతి రంగు వెలియక మునుపె…
రాస లీలల నాడు రమణీయ రూపంబు,
కనువిందుగా నేడు కనుపించరాదా!
చేరి చెలిమిని పంచ అనువైన భాగ్యంబు,
ఆనంద బాల మా కందించ రాదా!
రంగు రంగుల జగతి రంగు వెలియక మునుపె….
రమణీయ మౌ చరిత రమ్యముగ పలికేటి,
శుక మానసోల్లాస కరుణించరాదా!
రసధారలో మునిగి రమియించు భూసురుని,
మనసు పోలిక నొసగి మన్నించ రాదా!
రంగు రంగుల జగతి రంగు వెలియక మునుపె…..
ముని వరులు మోహించి మౌనమొందే రూపు,
నారదాదులు నమ్మి కీర్తించు ఆ రూపు,
కలి బాధ కడదేర్చ కరి నమ్మినా రూపు,
కాపుగా నుంటినని బదులీయ రాదా!
రంగు రంగుల జగతి రంగు వెలియక మునుపె,
శ్రీరంగ నీ జాడ నెరిగించ రారా
రస హీనమై జగతి రాగమందుటె మరచె,
రస రాజమైనట్టి నామ మీరాద!
రంగు రంగుల జగతి రంగు వెలియక మునుపె…