తనను దానం అడుగ వచ్చిన కురచ వటువు శ్రీమహా విష్ణువని, తన గురువు అయిన శుక్రాచార్యుని వల్ల తెలుసుకున్న బలి చక్రవర్తి – తన మనసులో ……..
చాటు మాటున జేరి చల్ల ముంతలు దోచి,
పల్లె పడుచుల మురిపె మందువాడ!
మితి లేని లోకాలు లోనున్న రూపమును,
గుజ్జు రూపము చాటు జేసినావా?
చిన్ని గజ్జెలు గట్టి శిఖిపింఛమును బెట్టి,
చిన్ని శిశువని నిన్ను చేరదీసి,
మురిపాన దేలేటి నందునిల్లాలింత,
టక్కరివి నీవంచు ఎరుగ లేదు!
గోవిందుడని నిన్ను గారవించే వారు,
గోరు ముద్దలు కుడిపి మురియువారు,
మాటుగా లోనున్న మహనీయు నెరుగరే,
తడబాటుతో తొలగి ఒదిగి నిలవంగా!
సిరి మెచ్చినా చేయి మానంబు గాయకే,
చాచి ఎంగిలి నంది కుడుచు వాడా!
మోమాటమే లేక పలుమారు చాచితివి,
భక్తి బిచ్చము నంద అదుపులేక!
గంగ బుట్టిన పణ్య పదమైన పాదంబు,
నమ్మి మునివరులెల్ల కొలుచు పదము,
కామినీ పాపంబు గాచి కడిగిన పదము,
కావదే నా అహము అసురవైరా!
హరిహరాదులు పూజ లందేటి పాదంబు,
రమ రమించెడి దివ్య పుణ్య పదము,
నారదాదులు గొల్వ వేచుండు పాదంబు,
నేడు నే నర్చింతు నళిన నేత్రా!
వైరాన నిను జేరు దనుజునై బుట్టినా,
కోరిజేరితివయ్య పూజనంద!
ముల్లోకముల కోర్కె లీడెర్చు చైజాచి,
తిరుప మడిగితివయ్య తిమిరహరణ!
శ్రీలక్ష్మి చెంగావి పైట అద్దిన పదము,
నేడు నా పాలాయె నళిన నేత్రా!
కరకు కర్మలనాడు కరమనెంచగబోకు,
కోరి కొంచెంబైన కంద నీను!
మౌన భాషలనంది భాసించు దైవమా!
మదిన మర్మమునెల్ల చెల్లజేయి,
అంది నా దానంబు దానవుల దయనేలు,
దుడుకు వారమెగాని పరులు గాము!
మాయ నల్లగ మాకు సాటి మేమేయంచు,
పలు మాయ లల్లి రణ మాడువార,
మోహాన ముంచగల జాణ రూపము గట్టి,
వైనముగ వైరులను గాచువాడ!
నేటి నీ రూపంబు మాయ పొర మరచెనో!
మించి నీ దయ నన్ను ఎంచ నెంచో!
గురువులకు గురువైన నిన్ను గురువే చూపి,
గురుతు దెలిపెను నీదు ఉనికి నిపుడు!
కోరి కులమున బుట్టి కావ నెంచితి వయ్య,
తోడ బుట్టిన మమ్ము మరువ బోకు,
దుందుడుకు వారమని వైర మెంచగ తగున,
లీల లాడగ నీకు తోడు మేము!
వటువుగా నను జేరి భిక్షగోరిన వాడ,
పదము బట్టిన వాని గాచువాడ,
ఏరీతి నీ నీతి నేడు నను గావకే,
హరియించు నా యశము లోకవంద్యా!