పగలు గడిచిన వెలుగు మొలచెను,
బాల భానుని వయసు మళ్ళెను,
మరులు గొలుపిన విరులు వాడెను,
వెలసి వెలుగులు నన్ను పిలిచెను!
మరలి రమ్మని తెరవు గాదని,
తరలు కాలము దాపురించెని,
దాపునెవరో తోడ నెంచితి,
నీడ నాదది తరలి పోయెను!
తనువుతో నడిచేరు కొందరు,
తగిన తెరవును చూపగా,
తెరపు మరపుల మాయమాటున,
మాయమై ఇక రారుగా!
మనసు కొందర మరచిపోవును,
కొంత తడవది వగవగా,
కొందరేమో కరుగ కుందురు,
మనసు అచ్చరు వొందగా!
కోరి కొందర చేరదీసిత,
కొందరికి నే చేరువై,
చేరువైనా – చేర దీసిన,
చెదరి పోయిరి నీడలై!
ఒంటరిగ నే నొస్తి నంటూ,
ఎరుక దెలిపిరి ఎందరో,
ఒంటిగానే వెడల వలెనని,
తెలసి కొంటిని బ్రతుకులో!
తొల్లి తగిలితి తనువు తోడని,
తోడెరుంగని దారిలో,
మరుగు నున్నా మనసు నేనని,
నమ్మి జారితి మాయలో!
నిలుకడెరుగని గాలి తరగలు,
తుళ్ళి ఆడే జలధి చిందులు,
జంటగా ఎరిగించు నిలకడ,
ఎంచ నెంచితి కదురుగా!
తోడు లేనీ జగతి తనకో,
తోడు వెదుకక మానినా,
తోయజాక్షుని తలచు కన్నులు,
తోడు వెదుకక మానునా!
సోలిపోయే తరుణమాయెను,
సన్ననాయెను సారము,
సావధానము నొంది తొందర,
సాకరా నను శశి ధరా!