వివరమెరుగని మనసు

నేను నేనే యంచు ప్రతిజీవి పలికినా,
ఎరుకగొన నొల్లనా ఎరుకేది మనసా!
ఏమరపుతో నెపుడు ఏ ఎరుక నెంచేను,
వివరమెరుగవె నీవు మనసా!
వివరింపవే నాకు మనసా!

వెలుగైన నీడైన వెంటనుండేవాని,
ఎరుకగొన నొల్లనా ఎరుకేది మనసా?
వెలుగు నీడల వెంట ఏమెరుగ తిరిగేనొ,
వివరమెరుగవె నీవు మనసా!
వివరింపవేనాకు మనసా!

వెలియైన లోనైన నిండియుండేవాని,
ఎరుకగొన నొల్లాన ఎరుకేది మనసా?
లోకాల లోతులను ఏమెరుగ వెదికేనొ,
వివరమెరుగవె నీవు మనసా!
వివరింపవేనాకు మనసా!

తలపు లన్నిటతానె తగలియుండేవాని,
ఎరుకగొన నొల్లనా ఎరుకేది మనసా?
తలపు తలుపులు మూసి తలపోయు తలపేది,
వివరమెరుగవె నీవు మనసా!
వివరింపవే నాకు మనసా!

జగమంత తానగుచు తోడుండుజతగాని,
ఎరుకగొన నొల్లనా ఎరుకేది మనసా?
తొలిగి పోయె జగతి తోడువెదికే దెవరు?
వివరమెరుగవె నీవు మనసా!
వివరింపవే నాకు మనసా!

నిదుర మబ్బులలోన తెలివైన పరమేశు,
ఎరుకగొన నొల్లనా ఎరుకేది మనసా?
నిదుర మత్తున దేలి మగత మునిగేదెవరు?
వివరమెరుగవె నీవు మనసా!
వివరింపవే నాకు మనసా!

పిలుపు పిలుపుకు తానె బదులు పలికేవాని,
ఎరుకగొన నొల్లనా ఎరుకేది మనసా?
పలుక నెరుగని జగతి బదులు వెదికేదెవరు?
వివరమెరుగవె నీవు మనసా!
వివరింపవే నాకు మనసా!

పుట్టుకెరుగని వాడు పురుడుపోసిన జగతి,
నినుజూసి నగునేమొ మనసా!
ఉనికి ఊపిరి నెరుగ ఉల్లాసపడునెవరు?
వివరమెరుగవె నీవు మనసా!
వివరింపవే నాకు మనసా!

మహనీయులెందరో పలుమారు తలపోసి,
మౌనాన మునిగిరట తెలుసా!
మునిగి మౌనములోన మతినెరిగి మురిసిరట,
మౌనమొందట నెరుగు మనసా!
వివరింపవే నాకు మనసా!

Leave a comment