మన్నించి దరిజేర

మాటిమాటికి నిన్ను మన్నించి దరిజేర – పల్లెవొల్లదు గొల్లబాలా!
గోధూళివేళందు యమున తీరుముజేరి – వేచియుందును నందబాలా!

ఉల్లాసమున నీవు వేణువూదేవేమొ – ఉలికిపడునీ పల్లె కిృష్ణా!
ఉరుకుపరుగున జనులు నిను గాంచ వచ్చేరు – దరిజేరలేనింక కిృష్ణా!

చిందులేయుచు నీవు సందడులు జేసేవు – చింతవీడును పల్లె కిృష్ణా!
చిరునవ్వు నగుమోము గాంచ వత్తురుజనులు – దరిజేరలేనింక కిృష్ణా!

నీవు నడిచేదారి విరులన్ని మతిమాలి – విరిసి చాటును జాడ కిృష్ణా!
జాడ నెరిగిన జనులు దరిజేర తరలేరు – దరిజేరలేనింక కిృష్ణా!

వెంట లేగలు నడువ నందబాలుడవంచు – నలుగు రెరిగేరయ్య కిృష్ణా!
ఆలమందలు నిన్ను అందగా తరలేను – దరిజేరలేనింక కిృష్ణా!

పొన్న కొమ్మల జేరి ఉయ్యాల లూగుచూ – రమ్మంచు పిలువకో కిృష్ణా!
పొంచియున్నా రాధ పలుసేవలందించు – దరిజేరలేనింక కిృష్ణా!

మాయ కవ్వలివాడ మన్నించు నా మనవి – మౌనాన దరిజేరు కిృష్ణా!
పల్లెలెరుగని వింత తీరునందున నీవు – దరిజేరి ననుబ్రోవు కిృష్ణా!

Leave a comment