ఉదయించెద నే

ఏ రూపంబుల బింబము లోకంబై కనుల గట్టు?
ఏ నాదంబుల ధ్వనులవి వేదంబై చెవుల గట్టు?
ఏ ఊపిరి జొరబడి ఈ లోకంబున శ్వాస బుట్టు?
ఏరీ నా కెరిగించెడి వారిట ఎవరో?

ఏ కమ్మని ఊహలకిది ఊపిరులూదిన లోకము?
ఏ కన్నులు నిదురించగ కన్నుల గట్టెడి లోకము?
ఏ గానంబుల గమనము గుసగుసలాడెటి లోకము?
ఏరీ నా కెరిగించెడి వారిట ఎవరో?

ఏ ఆటల అలసి సొలసి మునిగి మైకపు పొరలివి?
ఏ నందన వనమునుండి జారిన సన్నని విరులివి?
ఏ భావము రూపమంది నిండుగ నడచిన నెలవిది?
ఏరీ నా కెరిగించెడి వారిట ఎవరో?

ఎన్నడు కరుగును ఈ కల – ఎన్నడు నే నెరుక గొందు?
ఎవ్వరు నను లాలించగ – మేలని నను మేలుకొల్పు?
ఏసవ్వడి సారంబులు సంసారపు సడుల మాపు?
ఏరీ నా కెరిగించెడి వారిట ఎవరో?

ఏమరపెరుగని వాడట లోకాలకు నాయకుడట,
ఏబదులెరుగని పలుకున బదులైతా పలికేనట,
ఏలీలల జోలలలో ఏమరుపొందెనొ ఏమో,
ఎరిగించరె ఎవరైనా నా ఎరుకను ఎరిగింపగ!

అన్నుల మిన్నగు ఆమని అందగ నే నుదయించగ!

Leave a comment