ఎవ్వడనేను ?

ఏ రూపుల ఛాయ నేను? ఏ ధ్వనులకు ప్రతిని నేను?
ఎన్నగ నేనను వాడను ఎవ్వడనే నెక్కడివాడను?
తెరపెరుగక మరపెరుగక మరిమరి తాపమునెంచక,
మరల మరల తిరిగి తిరిగి నేనిట కేగుట ఎందుకు?

ఏ లోకపు ప్రతిగ జగతి నిండారగ నెలవొందెను?
ఏ ఆనలు నెలవొందగ ముచ్చటగొని మాయమరెను?
ఏ సందడి సంతరించి సుందర నందనమమరెను?
ఏ మోహపు మడుల మునిగి నేనిట ఎందులకేగితి?

సన్ననైన సువాసనలు- బహు కమ్మని ఫలరాసులు!
రంగరించి పలు రంగులు రచియించిన పలు సంధ్యలు!
రుచికందని రుచులు కుడుప వలలుని వంటల సందడి!
వారాంగన వంటి జగతి మోహపు ముంపుల ముంచెను!

ఏగిన కారణమేమో మరుగాయెను మరుల మునిగి!
తనువొక్కటి తలపొక్కటి ఒకటికి ఒకటై కూడుచు,
ఎడతెరుపెరుగని దొంతుల పుంతలుగా పెరిగిపెరిగి,
వెనుకటి జాడల గురుతులు గురుతొందగ భారమాయె!
మున్నెందరొ తరచి తరచి మరులను వీడగ గనిరట,
మందాకిని వంటి మదిన మునకలు వేయగ గనిరట,
మునుకలలో మైమరపును మరచెడి తీరును గనిరట,
మన్నన నెంచరె వారలు మది చింతలు దీరా!

Leave a comment