చిలిపి చిందుల చిన్ని అలలివి – చింత చెందకు చెలియరో,
చినుకు చినుకును చేరదీసెడి – కడలి కావలి యుండులే!
ఒరవడొందిన చిన్ని చినుకులు – ఓరిమొందగ నెంచవే,
పంతమాడెడి పరుగుతో పలు వింత రూపుల నొందులే!
రివ్వునెగెరెడి చిన్ని చినుకులు చేరవే ఏ నింగినీ,
తిరిగి చేరును అలుపు తీరగ – కడలి ఒడిలో నేరుగా!
చిలిపి చిందుల చిన్ని అలలివి – చింత చెందకు చెలియరో!
కడలి గుండెల లోతులో ఏ కదలికందిన చిందులో,
ఉరికి ఉప్పెన పోటుగా ఈ తీరమందున చేరెనో,
ఊరడించెడి ఒడిని విడెడి తీరు తెలియని చిందులే,
చిన్నబోయిన నాడు నయమున చేరు సాగరు సందిట!
చిలిపి చిందుల చిన్ని అలలివి – చింత చెందకు చెలియరో!
కాలుడందిన కదన లయలకు జోడు జేరిన చిందులు,
మేటి మువ్వల రవళులై లయ నాడు లాస్యము నెంచవే,
నీది నాదని భేదమెరుగని భువనైక మోహను కేళిలో,
లాలి జోలల ఊగనొల్లని చిలిపి చిందుల నెంచవే!
చిలిపి చిందుల చిన్ని అలలివి – చింత చెందకు చెలియరో!
చినుకు చినుకును చేరదీసెడి – కడలి కావలి యుండులే!