బొంది బంధము

బొందినంటినవాడు తరలిపోయేరోజు,
తరలుతావుల జాడ తెలుపలేడు,
తనువుతోడగువారు తరలగాతరిలేక,
మన్ననెంచక దాని మంటగలుపు!
మాయలోకపు తీరు ఎంచ తీరికలేక,
మరల మాయనజేరి మరులమునుగు!

బొందితోజతజేరి బంధాలు పదివేలు
తొలగునాడవియన్ని తీరిపోవు,
తోడునడువని యట్టి బంధ మోహములన్ని,
తగిన తావులు గనక తరలి పోవు!
మాయమోసపు మదిర మత్తు మరగిన జగతి,
మరల మరలా మునిగి మనగ నెంచు!

కొరగాని ఈ కట్టె కాటివరకే గాని,
కోసరి కొంచెంబైన తోడురాదు,
కట్టె కాలకముందె కదలిపోయే జగతి,
కనుల గట్టగ నేల కలువరింత?
కానివారలు కారు కాల నియమంబిదే,
తెలసి తెరపిన తరలు తరుణమందు!

Leave a comment