పాలసంద్రపు అలల పొంగుల – పురుడు పోసుకు నింగి కెగసిన,
రోహిణీ పతి లేత నవ్వులు – జలక మాడిన గంగ చినుకులు,
చింది తడిసెడి హరుని ఫాలము – వెన్నెలలు కురిపించదే!
విన్నపంబులు వినగ వేడిన – పంచ బాణుని మధుర గీతిని,
మన్ననెంచక మంట గలిపెడి – చూపులే కురిపించునే!
చింకి పాతలు చిగురుటాకులు – చేర్చి పేర్చిన మెత్త పరుపులు,
ఆదరము నానందమొందుచు – అందజేసెడి చిన్ని కుడుపులు,
ఉనికిగా ఈ జగతికురికిన – మనసు పదిలము చేయదే!
ఉగ్గు కుడిపిన కటిక రుచులను – ఊరడించని ఉడుకు చేతలు,
పొదిగి పరువపు పరుగులో – పలు ఛాయలై మది నిండులే !
మయుని మించిన వింత పోకడ – పొదిగి పెంచిన వింత లోకము,
మాయధారిది నిలకడెరుగదు – మనగ నెంచును మాయలో,
మనుగడెరుగక నలుగు మనసుల – వేదనను మడియించదే !
తగులు బంధము తెగెడి తీరులు – తొల్లి తెలియని మనసులు,
చెల్లిపోయెడి చెలిమి చింతన – చితికి కుములుట పాడియే!
వయను పెరిగిన మనసు విరుగదు – మంద భాగ్యము మనసుదే,
మాటిమాటికి నాటితలపులు తరచి – ఎంచుట మనదే!
ముందు దారుల మధుర ఊహలు – మసక మనసుకు తోచవే!
ముందు వెనుకలు లేని లోకము – వేడుకొందుట మానదే!
మది చితికి చివుకుట మానదే! గతి మాలి కుములుట మానదే!