లోకాల లాలననేలు వాడిట జోల లూగెను చూడరె,
రేపల్లె భామల భాగ్యమే – ఆ నంద డోలల నూపగా!
రేపల్లె భామల భాగ్యమే – ఆనంద డోలల నూగగా!
ఏ నగవు నందిన నాకములు – నవ శోభలన శోభించెనో,
ఏ నగవు గని ఆ సిరుల రాణీ – తా దాసి యై తన నూచెనో,
ఆ నగవు ఏలెడి మోవి నేడిట చిన్ని నగవుల నేర్చెనే,
తా గొల్లభామల మోవి నడకల మెల్లగా జత జేరెనే!
లోకాల లాలననేలు వాడిట జోల లూగెను చూడరె,
రేపల్లె భామల భాగ్యమే – ఆ నంద డోలల నూపగా!
రేపల్లె భామల భాగ్యమే – ఆనంద డోలల నూగగా!
సుర గంగ పుట్టిన పుణ్యపాదము – సురలు కొలిచెడి పాదము,
సనకాది మునిగణ మానసంబులు ఎంచి కొలిచెడి పాదము,
సురవైరి నొల్లక లోకములు తా ఎంచి కొలిచిన పాదము,
ఆ పాదములు నే డాడి అలసెను – గొల్ల వీధుల ధూళిలో..
లోకాల లాలననేలు వాడిట జోల లూగెను చూడరె,
రేపల్లె భామల భాగ్యమే – ఆ నంద డోలల నూపగా!
రేపల్లె భామల భాగ్యమే – ఆనంద డోలల నూగగా!
ఈ జోల పాటను నా సొంత ట్యూన్ లో
https://www.youtube.com/watch?v=hi0FXF545gc
లో విన వచ్చు