హరి పుత్రుని సంచారము – హరియింపదె శిశిర చింత,
మోడులు తొడిగిన చిగురుల – మొలిచెడి నూతన ఊహలు,
గడచిన గండపు గడియల – గాయంబుల గురుతు మాపి,
కమ్మని కాలపు భావము – కన్నుల నిండుగ నింపదె!
పాలాంబుధి మధియించగ – పుట్టిన ముంతెడు విసమును,
ఫాలాక్షుడు నాడు మింగి – పాలించెను హరి పలుకులు!
రుచి సాగర మధనంబున – పుట్టి వింతగు పుంతను,
తనియారగ తినిన వాడు – తరళాక్షుని తలుపడాయె!
నిలుకడ నెరుగని కాలము – కాలుని చెలిమిని పట్టుక,
పట్టిన పట్టుకు తడబడి – పలుదారుల పరుగిడినా,
అంతము నాదియుగు ఆ – నందాంగన ముద్దు పట్టి,
మన్నన మీరగ గట్టగ – విడువక పట్టిన పట్టును,
నెమ్మది నొందిన మనసున – మన్ననతో కనడాయెను!
మాయామయ జగతి దారి – మన్నన నెరుగగ నెంచదు,
మతిమాలిన ఋచులు జూపి – మోహాంబుధి మడిగించును,
మడిగిన జీవుల దొంతులు – దొరలెడి దారుల నిలబడి,
మరలెడి దారుల జాడలు – పలుమారులు ఎరిగించును!
నెమ్మది నొందిన మనమున – ఎరిగించిన ఎరుక నెరిగి,
తీరిక నెరుగని పరుగులు – తగినంతగ తరుగ జేసి,
తనువున తోడగు వానిని – తలచెడి తీరెరిగి నేడు,
శర్వుని తోడుగ శార్వరి – శాంతుల కాంతుల మసలరె!
(శర్వుడు – శివుడు ; శార్వరి – చీకటి)
ం