కన్నీరు

దీపముందను ఉనికి వెలుగులే తెలుపు,
వెలుగు వెన్నెల తెలుపు రేరెజు ఉనికి,
చిలుక పలుకులు చిలుకు ఋతురజునునికి,
కనుల చిందెడి నీరు తెలుపునే ఉనికి?

గండుకోకిల పిలుపు చిగురునికి తెలుపు,
చిలుక సందడి తెలుపు ఫలరసాలునికి,
లేగ చిందులు తెలుపు గోధనపు ఉనికి,
కనుల చిందెడి నీరు తెలుపునే ఉనికి?

మురళి గానము తెలుపు గోపాలునునికి,
అందె సందడి తెలుపు గోపెమ్మ ఉనికి,
విరిమధువు రుచి తెలుపు మత్త మధుపంబు,
కనుల చిందెడి నీరు తెలుపునే ఉనికి?

పాంచజన్యపు పిలుపు రణమునికి తెలుపు,
డమరుకం బెరిగించు లయకారు నునికి,
మధుర కచ్చపి తెలుపు పద్మభవునునికి,
కనుల చిందెడి నీరు తెలుపునే ఉనికి?

వనచరంబుల చరిత ముని ఉనికి తెలుపు,
కేకి నృత్యము తెలుపు మేఘ గమనమును,
కమలాలు కనువిప్పి రవి రాక తెలుపు,
కనుల చిందెడి నీరు తెలుపునే ఉనికి?

తపసు పండిన తపసి కనులు నిండేను,
ప్రియుని గాంచిన పడతి కన్నులూరేను,
తనయు నెడబాసితే తడియౌను కనులు,
తనువు తాపమునొంద పొంగేను కనులు,
చెలిమి చింతల మునుగ కన్నులూరేను,
చేర వచ్చిన చెలిమి కనులు నింపేను,
బహు భావ పునికైన కన్నీటి చినుకు ,
తెలుపనెంచిన ఉనికి తెలుపునది ఎవరు?

Leave a comment