తరుణ మాయెను తరలి రండని పిలిచెనిదిగో తరలరే!
తరుణులారిదె పిలుపు నందరె పిల్లగాలుల తెరలపై,
తేలి తేలిదె మురళినాదము తేనె ఊటలు పంచెనే,
వీనులంజలి పట్టి కుడువరె మనసు మాధవు తలవగా!
వీనులందిన కుడుపు నందుచు లేగ కుడుచుట మానెనే,
మధుర గానము మదిన జేరగ గోవు నమలుట మానెనే,
మధువు గ్రోలగ విరుల జేరిన వెఱ్ఱి మధుపము లాగెనే,
కుడుచు టెరుగని వీనులీతరి మధుర పానము జేయగా!
వీనులెరుగని విరులు ఈ తరి విరిసి వేడుక జేసెనే,
వేణులోలుని అడుగు జాడలు మధువు మడుగుల జేసెనే,
చిత్తడందిన చిత్రమేఖల పురులు పరచుచు ఆడెనే,
గండుకోకిల కూయకే తన పెంటి జంటను జేరెనే!
అల్లనల్లన అలల పడగలు లయగ ఊగుచు ఆడెనే,
సుడులు తిరుగుచు నీటి ఊటలు పాట మధువును గ్రోలెనే,
సందడించక సకల జీవులు మధుర ఊహల మనిగిరే,
సావకాశము నొంద సమయము తనువు సంతనమొందగా!
వల్లభుండై వసుధ నేలెడి మాధవుని చిరు మోవిపై,
నిలువ పున్నెము జేసికొన్నా మురళి పుట్థిన పొదలలో,
పలుమారు తిరిగిన గాలితరగలు పలుకవే ఏ పాటలూ,
పాటపుట్టిన మోవి మహిమది ఎన్న మురళిది గాదుగా!
మోహనుండా నందబాలుడు మధురమే ప్రతి పోలికా,
మంద భాగ్యలు పుడమివాసులు అందరే ఆనందము,
నింగి దారుల తరలు వారలు తేరి జూడగ నిలుతురే,
నెలతరో ఈ నీరజాక్షుని కనగ కన్నులు మూయరే!