సుదర్శనం

రామకిృష్ణులు వెడలెరిదె – ముదమారగా గనరే,
చింత దీర్చగ చెన్నకేశుడు చెలులతో పురవీధి నడచెను!

పసిడి మువ్వలు మురిసి అమరిన పాదమును గనరే,
గంగబుట్టిన పుణ్యపాదపు రూపమిదె గనరే,
వసుధ నడిచెడి వాసుదేవుని వన్నెలివె గనరే,
దానవాంతకు దరిని జేరెడి దారి విడువరదే!|| రామకిృష్ణులు వెడలెరిదె ||

గోపకాంతలు గారవించిన చిన్ని శిశువితడే,
లోకములు తన లోన గల్గిన గొల్లవాడితడే
ముద్దుగారెడి మోము నేడిదె విందుగా గనరే
కాంచ గల్లిన కనుల భాగ్యమ పండగా గనరే!|| రామకిృష్ణులు వెడలెరిదె ||

నారదాదుల మదిని ఏలెడి వేదవిభుడితడే,
నాడు ధరణిని గాచి తెచ్చిన సూకరంబితడే,
జగతి మురియగ సిరి బట్టిన శ్రీకరుండితడే,
బ్రతుకు పండెడి సిరులు బొందగ వేడగాజనరే! || రామకిృష్ణులు వెడలెరిదె ||

వెన్నకడవల కొల్ల జేసెడి వెన్నదొంగితడే,
వెన్నెలాటల వన్నెకెక్కిన మాధవుండితడే,
పాంచజన్యము విడిచి వేణువు నూదువాడితడే!
వెరపు మాయగ వేణులోలుని వేడుకగ గనరే!

రామకిృష్ణులు వెడలెరిదె – ముదమారగా గనరే,
చింత దీర్చగ చెన్నకేశుడు చెలులతో పురవీధి నడచెను!

Leave a comment