రక్ష నీకా రాధికా పతి – రక్ష రఘుకుల వీరుడు!
రతి రాజ మర్ధనుడాదరంబున రక్షయగు నీ మనసుకు!
కోసలేశుని రమణి నిరతము తోడుయై నిను గావగా,
కోటి వేల్పుల దీవెనందిన హనుమ నీ జత నడచుగా!
కడుపు చల్లగ కాశివాసిని కరుణతో నిను కుడుపగా,
కామజనకుని కాంత చల్లని చూపులన దీవించుగా!
వాణి శారద శ్యాలాంబిక యోచనల శాసించగా ,
వారాహి వైష్ణవి సర్వదా నీ వైనమును సరి గాచుగా!
యోగినీగణ మలుపెరుంగక జాగరూకత నొందగా,
నారసింహుడు లచ్చితోడుగ నిన్ను సాకగ నెంచుగా!
బొజ్జగణపతి అన్నతోడుగ అన్ని గడులను గడుపగా,
కాల మహిమన కలుగు చేటును కాళికే హరియించుగా!
వారువీరని వేరెరుంగని అంతరంగుడు చెలిమితో,
దరి చేరి ఇక నీ దారి తోడుగ నిరతమును నినుగాచుగా!