విన్నపం

భవదీయుడని ఎంచి భక్తి బిచ్చము పెట్టు,
బహుతుంటరని ఎంచి ప్రేమ పాశము చుట్టు,
నీ నామ మధుపాన మత్త మానసమందు,
దండనీయవె నాకు – దురిత సంహారా!

రేపల్లె వాసులా గోపాల జనులెల్ల,
కన్నులారగ కన్న కమనీయ రూపంబు,
చూపాను చోటెల్ల చూడగల చూపులను,
దయసేయవే నాకు సకలార్తి దూరా!

సురవైరి సంతైన సురమౌని శిష్యుండు,
తలపులన్నిట నింపి తలచేటి నామంబు,
తగులు తలపులనెంచు తెరపైన తలపిచ్చి,
తరియింపజేయవే తిమిర సంహారా!

భావమందున నిన్నె భావించు భామలకు,
భామకొక బింబమై భాసించి మురిపించి,
భవమోహ పాశాల తరచి తరిమినయట్టి,
భావాన ముంచవే భవతాప హారా!

సరసమెరుగని మాయ జంకెరుకుందయ్య,
సావకాశము మరచి తనువెల్ల నిండేను,
తాడించి ఇక దాని తరిమి నను రక్షించు,
కన్నతండ్రివి నీవు కలుషాపహారా!

Leave a comment