రమ్యమైనీ జగతి నూతనత్వము జూసి,
మోహాన మునుగుచూ మోదాన తేలుచూ,
మలిగేటి రంగులకు ఖేదాన తూగేటి,
మనసు కాదయనేను మన్నించు దేవ!
పొరుగువారల పచ్చ ఓపనోర్వగలేక,
పలు తెరుంగుల నల్లి వాని నణగించి,
ఏదారి నేజేసి భోగాన మురుతునను,
బుద్ధికాదయ నేను మన్నించు దేవ!
తగిలున్న ఈ తనువు తానేయనెంచుచూ,
తగులు బంధములెల్ల తనవేయనెంచుచూ,
చేతలందున చేవ తనఘనతననెంచేటి
చిత్తాహంకారములు నేను కాదయ్యా!
మాయకవ్వలివాడ మోదమొందగ నీవు,
పంచభూతములందు పూరించి ఈజగతి,
పలువింత నియమాల నెరపించి మురిసేవు,
నియతి తప్పగ మాకు దారులేవయ్యా?
తామసులుగా మమ్ము భావింపగానీవు,
తగు తుంటరాటలే ఆడుతామయ్యా,
నియమమిది నిలువన్న నిలకడెంచగ నీక,
తరలించు నీ నియతి వారించగలమా?
సత్వమును రాజసము నీవిచ్చు ఛాయలే,
సరి నడత సూచించి నడిపించు నీవె,
పొల్లుచేతల జేయ తరమౌన దేవరా,
తొలగినీ ఆనతులు వీసమంతైనా?
మువన్నె యగు నూలు మగ్గమందుంచి,
నాల్గు విధముల నేత నడిపింతువయ్యా,
మురిపాల నీ దేవి సింగారమమరించి,
పంచధాతువులందె పలుమారు పలుక!
చేతలన్నియు నీవె చేవయును నీదే,
చెలికానిగా నన్ను చేరబిలువయ్యా!
నాదన్నదెరుగగా ఏది లేదని తెలిసి,
మోనాన మునిగేను మన్నింపుమయ్యా!