దిక్కులన్నిట నిండి దీవించువాడుండ,
ధరణి దుఃఖపు మడుగు నేల మునిగేను?
మునిగణంబులు గొల్వ మురిసేటి దేవుడా,
బదులేల మాకీవు నీ సుతుల గామా?
మదను గూల్చినవాడ సురవైరివేల్పా,
తనువు పంచగనేల తరుణి తపియింప?
తాపసులు గొల్చిరని గంగనందినవాడ,
తామసపు కొలువిచ్చి మము సాకనేల?
గజరాజు మొరలిడగ తరలిబ్రోచినవాడ,
నేటిమొరలాలించ జాగేలనయ్యా?
వైరులందరు నీదు నీడలై మనుచుండ,
మధుకైభుల నణచి ఏమి ఫలమయ్యా?
సారధై రణమాడి నరుని గాచిన రమణ,
సరిదారి మమునడుప తరలిరావయ్యా!
తారకంబగు తోవ తరలించి మముబ్రోవ,
సమయమేదని ఎంచ తగినతీరగునె!
సాగరుని సతులెల్ల సవతి సంగము వెరచి,
కమలనాధుని కొలువ తరలి గగనముజేర,
ధరణి తాపము దీర్ప కేలాస గిరి కరిగి,
శివ గణంబుల సంగమంది నడిచె!
కనులనొలికే నీరు ధరణి జీవులు కుడిచి,
కటిక భావననంది బ్రతుకు నడిపేరు,
కలకంఠి కనులందె కొలువుదీరే కరుణ,
కురిసి మము కడతేర్ప ఎపుడు కదిలేను?
దిక్కులన్నిట నిండి ధరణి గాచెడివాడ,
ఊది వేదములందు శ్వాస నింపినవాడ,
గతితప్పి ఊపిరులు వేదాలు వాదమై,
ధరణి ఖిన్నతనొందె దయనేల రారా!
రూపులన్నిట నిండి రమియించు వాడవని,
వసుధ నమ్మిన యట్టి దివ్యచరితా!
ధరియింపు మీ ధరణి దయతోన మమ్మేల,
సంతు సంకటమొంద సహియింపతగునా?