శరణు సమవర్తి

దక్షిణపు వాకిళ్ళు తెరచి తరలే తేరు,
చిరుగంట నాదాలు దిశలన్ని నిండగా,
సమయపాలకు నాన ఆదరంబున నెంచి,
గడప గడపను దాటి నా గడప నిలుమా!

అమృతంబే కురిసి అవని పులకించినా,
ఆనంద ధామమే ధర ఒడిన ఒదిగినా,
అమరులీ వసుధపై వాసంబునెరపినా,
ఆదరంబున నన్ను అందిగొంపొమ్మా!

వారాణసీ పతిని వలచి చేరిన తల్లి,
వాసమై ఈ వసుధ వైభవంబొందినా,
వాదెంచకాతల్లి కరుణతో కుడిపినా,
వారింపనెంచకిక అందినను గొనుమా!

నందబాలుని తోడు వెన్నంటియున్నా,
నందనంబై పుడమి నవశోభగొన్నా,
నందివాహను లీల నర్తనముకాగా,
నను వీడిజనబోకు దనుజారిధీరా!

వైదేహి వల్లభుని రూపంది నరులెల్ల,
వైరమెరుగక వసుధ నడయాడుచున్నా,
వైకుంఠమే ఒరిగి భువి నేలుచున్నా,
వైనంబుగా నన్ను వెంటగొని పొమ్మా!

పుడమి శోభలతప్ప కనలేని కనులు,
శోక మోహపు వలల మునిగున్న మనసు,
క్రోధ లోభపు కవచ సీమలో ఒదిగి,
భ్రమియించు భ్రమతీర కరుణతో గొమ్మా!

దక్షిణపు వాకిళ్ళు తెరచి తరలే తేరు,
చిరుగంట నాదాలు దిశలన్ని నిండగా,
సమయపాలకు నాన ఆదరంబున నెంచి,
గడప గడపను దాటి నా గడప నిలుమా!

Leave a comment