అతిధిః

జిలుగు తారల ముసుగు చాటు చేసిన జగతి,
వింత రంగుల వెలుగు వెలిగించు జగతి,
ఆకశము భూమన్న అంతరము గల జగతి,
అమరేంద్రు లేలికన అలరారు జగతి!

పాలపుంతన అమరి మురిపించు జగతి,
పలువన్నెలగు మణుల నెలవైన జగతి,
పసిడి కొండల చెండు కలిగున్న జగతి,
పార్వతీ పతి మెచ్చి కొలువున్న జగతి!

నాకాల మరపించు నందనంబుల జగతి,
నారాయణుని ఇంతి అలుక మాపే జగతి,
వేదాల నాదాలు రూపు గట్టిన జగతి,
అమర వాసులు అలసి సేదదీరే జగతి!

లీలావినోదుడా గోపాల బాలుండు,
ఊదు ఊపిరులంది మోదించు జగతి,
మిత్తి మత్తును మరగి మురిసేటి జీవాలు,
అలుపెరుగ కాడేటి అందాల జగతి!

వసతి వన్నెల జూచి వలచి వచ్చితి గాని,
వాసముండగ లేను మరలనెంచక నేను,
తరుగు వన్నెల వలువ పలుమారు చుట్టినా,
తగుల నెంచగ లేను తరలు తరి వీడి!

భ్రమల బంగరు తేరు ఏలేటి ఈ జగతి,
భావింపగల యట్టి పట్టు పుట్టము గట్టి,
పట్టి గట్టిగ నన్ను పలు ఆటలన చుట్టి,
పంతాన పడగొట్ట బెదరి ఓడగబోను!

తోడు తరలిన వాడు మురిపాన మునిగినా,
మారు పలుకక తాను మౌనమే పొందినా,
తెరపి కలుగగ జేసి తరలించి నేపోదు,
సరి తరుణమాయెనని వివరించి నేడు!

Leave a comment