కృంగుటెరుగని వెలుగు ఉదయించి నారోజు,
వెరచి చీకటులన్ని చిన్నబోయిన రోజు,
వెన్నెలే వేకువై వెతలన్ని వెడలింప,
మాటు మరచిన మనసు మౌనంబు మరచె!
మారాకు మామిళు మరగి కోకిలకూసె,
తొలి వెలుగు తాకిళ్ళు మనసు తలుపున మీటె,
మంతనాలిక చెల్లి కలలు మరుగున జేరె,
కాననెంచని కనుల కమలాక్షుడుదయించె!
విచ్చు రెప్పలవెంట చూపంటి నడయాడి,
చూచు చూపుగ తానె తోచుచుండగ నేడు,
తల్లిలో చెల్లిలో తోడుండు చెలులలో,
తొంగి చూచుచు తానె బదులాడె ప్రతిసారి!
సింగార మమరంగ చేరి నే నద్దమును,
పరచి చూపుల నేను పరికించి చూడంగ,
వారిజాక్షుల మనసు మోహించు మొనగాడు,
మొలచె అద్దమునందు నాకు బదులు!
ప్రియమార పూజింప విరులంద నేబోగ,
విరిసి విరులన్నింట నూత్న శోభలు నిండ,
రెమ్మకొమ్మల నిండ కొలువున్న పూవింట ,
అరవింద నేత్రుండు ఆదరంబున నగియె!
తరువులో తనువులో చిందు చిరు చినుకులో
ఫలములో పాలలో పొదరింటి సొగసులో,
మదినెంచి తలపోయ తలచినా తలపులో.
వొదిగి వన్నెలు చిందు వరమౌని వల్లభుడు!
నిత్యమైనీ వెలుగు వెలయంగ బోదింక,
నిదుర మబ్బుల నీడ నన్నంట బోదింక,
కరుగుటెరుగని కాల లోగిళ్ళ కొలువుండు,
నంద నందను జాడ నన్నంది మనుదాక!
కృంగుటెలుగని వెలుగు ఉదయించి నారోజు,
వెరచి చీకటులన్ని చిన్నబోయిన రోజు,
వెన్నెలే వేకువై వెతలన్ని వెడలింప,
మాటు మరచిన మనసు మౌనంబు మరచె!