వాడిపోవని ‘వాడు’ వీడితోడుండునట,
వాడిపోయిన నాడు ‘వీని’ తరలించునట,
వీడుచేరిన గూడు తోడుండ జేరునట,
తోడుండి తొలగుండి ఏ వింత జూచునో!
వాడు వీడూ కానీ వేరొకటి కలిగుండి,
వాడినీ వీడినీ తనయందు నిలుపునట,
వీని మనసున జేరి వాని మరపించేను,
తోడుండగా నేగి తొలగుండ వాడేల?
వెర్రి వాడగు వీడు వెన్నంటి వాడొకడు,
వెన్నుగాచుననంచు మైమరచి మనినంత
వైనమంతయు నీది వేదనయు నీదంచు,
మిన్నకుండెడి తోడు కలిగుండి ఫలమేమి?
మరలించి మరపించి మౌన భాషల నెంచి,
మనసన్న మరపులో పలుమారు పొరలించి,
పొగిలి వగచేనాడు వెలుగు చూపగ నెంచ,
నియతి నియమమనంచు తొలగుండ వాడేల!
వాని కనుసన్నలన కనువిప్పు నీ జగతి,
వాని ఊపిరులంది నడయాడు నీ జగతి,
ఊహ లందిన రూపు వీడన్న ఈ గురుతు,
తోడుగాదయ వాడు -వీడైన వాడతడే!
వాని కన్నుల మెరుపు మరపించు లోకాన,
మరలుటెరుగుట మాని మనగల్గు తీరాన,
వానికంటెను వేరు వైనమెరుగని పురిన,
వాలి వందనమంచు వొదిగి మన నెపుడో!