ఏ రోజు కా రోజు ఎరిగించగా నేదొ – కదలి కొమ్మల కరము కదలి రమ్మని పిలిచె!
ఏ రోజు కా రోజు మరుగైన తలపులను – మరల నెరిగించగా చేర రమ్మని పిలిచె!
నిశిరేయి మౌనాలు తరగిపోయే వేళ – జారిపోవని తెలివి జాగృతొందే వేళ!
తొలగి చిగురుల తొడుగు తొంగిచూశేవేళ – తేరి నన్నే జూసి నగియ నెంచె!
రూపులెన్నియొ గల్గు సంతుగల్గిన తల్లి- తల్లి మనకని తెల్ప తొందరించె!
కనగల్గు రూపెల్ల తోటిదే నని దెల్పి – తోడబుట్టిన వారి తెలుప నెంచె!
గగనమంటెడి గిరులు – గమన మాగని నదులు – గతిని నిల్పెడి శ్వాస,
ఫలములిచ్చే తరులు -తుంటరాటల ఝరులు-కన్నదీమే మనల కన్నతల్లి!
పంచవన్నెల చిలుక- పరుగు లందే మృగము-పొంచి వేటాడేటి సింగములను,
పొట్టి పొడుగులు గల్గి పలు చర్మకాంతులతో శోభించి ఒప్పారు నరుల నెల్లా,
భావాల భవనాల భోగమందెడి రీతి – మన్ననెంచుచు తానె మనుపనెంచి,
లాలించి పాలించ భేదమెంచగ తగదు – తోడ బుట్టితి మిచట తల్లి ధరకు!
కంకణంబుల కరము కదలి పిలిచినయట్లు-కాలి అందెల సద్దు చేరవచ్చినయట్లు,
సరిగంచు కొంగొకటి మోమునాడినయట్లు – తామరల తావులీ తనువు నానిన యట్లు,
తెరపు మరపుల తెలివి తేటనందక ముందె- తొలగి గగనపు దారి తరలిపోయినయట్లు,
గురుతెరుంగని గురుతు గరుతు దెల్పగ నెంచి- మగత వీడుమనంచు మరల పిలిచె!
ఆదమరువకు మంచు ఆదరిచగ నన్ను- అంతరంగపు తలుపు తట్టి పిలిచిన యట్లు,
నిదుర మబ్బుల మాటు మాటలేవో నన్ను- నింగి దారుల వెంట జంట జేరుమనట్లు,
కదలి కదలక నన్ను కదలించి కదలకే – కరగి కన్నుల మాటు కలకలంబై మెదిలి,
వసుధ వన్నెల వెలుగు నింగి కెగసిన యట్లు- వొలుకు వెన్నెల వెలుగు నందగాగోరె!
వెలితెరుంగని నగవులోలికించు గగనంబు- నగవందు కరుగుచూ కదిలేటి పనవాలు,
ఉనికి నెరుగుమనంచు ఊరడింపున తెలిపి- మరలి మరగున జేరి మౌనమొందే వేళ,
ఏ రోజు కా రోజు ఎరిగించగా నేదొ – కదలి కొమ్మల కరము కదలి రమ్మని పిలిచె!
ఏ రోజు కా రోజు మరుగైన తలపులను – మరల నెరిగించగా చేర రమ్మని పిలిచె!