నేడు నేడే నేడు

కరిగిపోయిన నిన్న కరగని గురుతులెన్నో కుమ్మరించెను,
చేర రమ్మని పిలుచు రేపులు రెప్పమాటున కలవరించెను,
అలసటొందక అడుగు లేయగ నేడు కరుగుచు చేరె నిన్నను,
ఎంత పంతము బూని నడచిన చేరకుంటిని రేవు రేవును!

చరితలైనా నాటి నడతలు నేటి నడకల నడత తెలిపెను,
కాలగతులన కరిగిపోతూ నిలకడైనొక ఒరవడొసగెను,
ఓరిమెంతో ఒపగల్గియు ఒరవడుల విడి నడువజాలను,
విరిగి ఒరవడి విడుచు దారుల నడువగా నాకేవి దారులు?

దేవ దేవుడు దేహధారిగ ధరణి నడచిన నాటి నడతలు,
నడువ నెంచగ తగును కొన్నని ఎంచి కొందరు ఎరుకజేసిరి,
ధారుణేలెడి ధీరుడాతడు దుడుకువారల దునుమనెంచిన,
దారులేపగిదెన్నగా నా దారులై నను దరికి జేర్చును?

దొడ్ధ వారలు నియమమెంచుక నెమ్మదెంచుక నడువ నేర్చిరి
నడక అడుగులు పెరుగుచున్నా నేడు నిన్నగ మారుచున్నా,
అడుగుకావల అందబోయెడి ఆదరంబగు రేపు అందదు,
మర్మమేదో ముందు నడచుచు రేపులో నను జేరనీయదు!

కనులు పండగ కన్న కలలను కొదువలేకట నిలువ జేసితి,
నేటి ఆకలి నదుపుజేయుచు రేపు రూపును చక్కజేసితి,
చెలిమి బలిమియు కలుగ జేసెడి కలిమి నాకై వేచెనంచూ,
వేగమించుక తరుగనెంచక తరలినా నే నంద నైతిని!

మాయపన్నిన మధుర జాలము జారవిడువదు జేరనీయదు,
మనసు పగ్గము పట్టి నన్నిట పరుగులెత్తుట మాన నీయదు,
నాటి ఖేదము నీరసించదు రేపు మోదము మహిని జేరదు,
నేటి దారుల నడచి నడచియు నేటి నెరుగగ అలసిపోయితి!

గడచి పోయిన నాటి తలపులు తరగి మరుగున జేరునా?

మరల లేనొక సౌధమందున మౌనమై నిదురించునా?
నేటి నెమ్మది ఎంచి మనసున మరుల నెంచగ నెంతునా?
కరగిపోవని నేటి వైభవ మెరిగి నే నిట నిలతునా?

Leave a comment