నేడె నిత్యము నేడె సత్యము నేటిదే ఈ పురమురా!
నాడు విడిచిన నీడలే నిను నేటి దారుల నడుపురా!
రేపు మాపుల తలపులే నిను నేటి తలపుల నిల్పురా!
తలపు తలుపులు మూసి నేటిని నిక్కముగ నీవెరుగుమా! ||నేడె నిత్యము నేడె సత్యము నేటిదే ఈ పురమురా!
నాడు విడిచిన నీడలే నిను నేటి దారుల నడుపురా!||
నేటి చేతలు నేటి మాటలు నేటి ఈ అనుభూతులు,
నాడుగా నీ చరిత నల్లుచు నీదు రూపును నిలిపినా,
నెమరు వేయుచు నాటి చేతల వంకలను సరిజేయగా,
నేడె యున్నది నేడె తగినది నిక్కమిదెయని తెలియరా!
||నేడె నిత్యము నేడె సత్యము నేటిదే ఈ పురమురా!
నాడు విడిచిన నీడలే నిను నేటి దారుల నడుపురా!||
ఘడియ ఘడియను ఉత్తరించుచు వెంటనే ఒకడుండినా,
అందవచ్చిన ఘడియ నందుచు అవనిదారుల నడువరా,
వీగి పోయిన ఘడియలిచ్చిన గురుతులన్నియు మరువరా,
రేకు విప్పిన నవ్య ఘడియన ఉనికినంతయు ఉంచరా!
||నేడె నిత్యము నేడె సత్యము నేటిదే ఈ పురమురా!
నాడు విడిచిన నీడలే నిను నేటి దారుల నడుపురా!||
సొంపులెన్నో కలిగి యున్నా సావకాశము ఎంతయున్నా,
ఊరడింపుల ఊయలందున సాంత్వనెంతో కలుగనున్నా, పురుడు పోసుక పుణ్య చరితగ అందినీదరి జేరకుంటే,
రేపుగానే మిగిలిపోయెడి రేపు అక్కర నేమి తీర్చును?
||నేడె నిత్యము నేడె సత్యము నేటిదే ఈ పురమురా!
నాడు విడిచిన నీడలే నిను నేటి దారుల నడుపురా!||
నిదుర లేవని రేపు నిన్నిక చేరబోదని నీరసించకు,
నిన్నువిడిచిన నిన్న నీకై కొరత నిచ్చెని చిన్నబోవకు,
నిన్ను నమ్ముక నిన్నె జేరిన నేటి నెన్నడు వీడబోవకు,
కలిగి యుండిన కలిమి విలువను మనసునంతా నింపరా!
||నేడె నిత్యము నేడె సత్యము నేటిదే ఈ పురమురా!
నాడు విడిచిన నీడలే నిను నేటి దారుల నడుపురా!||
నిన్న రేపుల నడుమ నలుగుచు నేటి నెడబాయనెంచకు,
కరిగిపోయెడి నేటి విలువను వివరమెంచుక మదుపు జేయర,
రాక పోకల ఊపిరూదుచు ఎదిగి ఒరిగెడి జగతి నెరుగర,
నడిమి నొదిగిన తరినిగని ఈ పురపు పున్నెము పెంపుజేయర!
||నేడె నిత్యము నేడె సత్యము నేటిదే ఈ పురమురా!
నాడు విడిచిన నీడలే నిను నేటి దారుల నడుపురా!||
నిక్కమైనీ నిజము నెరిగిక నిదురమత్తును వీడనెంచర!
నిమిష నిమిషము నీరజాక్షుని విడువనెంచక ఎంచ నెంచర!
నీడలన్నీ కరిగి మరుగగు వెన్నెలల వరియించ నెంచర!
అందరాదని పలువరించక రేపు యోచన మాన నెంచర!
నేడె నిత్యము నేడె సత్యము నేటిదే ఈ పురమురా!
పురము నేలెడి పుణ్యపురుషుని పొందుతరి ఇక నేడెరా!
వాదులన్నియు వెలసిపోవగ ఉల్లమందునె నిలువరా!
నిలచి నిలకడ నొంది కరుగక నేటిలో నివసించరా!