కరుణ కాళీ కరుణ

కరుణ మానకే కాళికా ఇక మిన్నకుండుట మానవే,
మహాగ్రాసవు మహాశనవు మరువ తగునా నన్నిలా?

  • నిలకడెరుగని కాలగతులను నిలువరించెడి తల్లివే,
    అలసి సొలసిన జగములారడి చక్కజేసెడి చెలిమివే,
    రచ్చజేసెడి రక్కసుల రణమాడి పూడ్చెడి దేవివే,
    చెల్లజేయగ జాలమేలనె చిటికె నిండని నా కధా!
    ||కరుణ మానకే కాళికా ఇక మిన్నకుండుట మానవే,
    మహాగ్రాసవు మహాశనవు మరువ తగునా నన్నిలా?||
  • నిలుకడెరుగక వర్తమానము మాసి మరుగున జేరునే,
    మన్ననైనా వేదనైనా కరుగ నెంచక నిలువదే,
    భ్రమవు నీవై ధరణి చరితను చతురతన చరియింతువే!
    చెరితమెంతని చెల్లజేయక నెమ్మదించుట న్యాయమా?
    ||కరుణ మానకే కాళికా ఇక మిన్నకుండుట మానవే,
    మహాగ్రాసవు మహాశనవు మరువ తగునా నన్నిలా?||
  • నీడలై వెన్నంటి నడిచెడి నాటి మూటల మోపులో,
    తోడువీడని మాయ జాడలు కుమ్మరించే మోజుతో,
    తడబడడుగుల తరలుటెంచక చెల్లిపోయె తనువునూ,
    సాదరంబున ఆదరించక మిన్నకుండుట న్యాయమా?
    ||కరుణ మానకే కాళికా ఇక మిన్నకుండుట మానవే,
    మహాగ్రాసవు మహాశనవు మరువ తగునా నన్నిలా?||
  • కరుణ మరచిన కాల గతులను కరుణతో కదలించుమా,
    కాలమంటని నీదు కరుణన కరుగ జేయగ నెంచుమా,
    గడచిపోయిన బాట నీడల గురుతులన్నీ మాపుమా,
    అణగి మూలము నీదు పదముల నీడ నందగ జేయుమా!
    ||కరుణ మానకే కాళికా ఇక మిన్నకుండుట మానవే,
    మహాగ్రాసవు మహా శనవు మన్ననెంచవె నన్నిక !||
  • తామసుల తరియింప జేయగ తనువు నందిన తల్లివే,
    తాపసుల మది మందిరంబుల లలిత కోమల వల్లివే,
    తరుగ జేయవె తొందరించిక కొల్లలగు నా కధలనూ,
    తగిలి యుండగ నేను తొలుగక నీదు పాదపు జాడను!
    ||కరుణ మానకే కాళికా ఇక మిన్నకుండుట మానవే,
    మహాగ్రాసవు మహా శనవు మన్ననెంచవె నన్నిక !||
  • అభయ కాళము జేరు దారుల దారి నను నడిపించుమా, (కాళము – నావ వంటిది)
    కాల వాహిని దరికి జేర్చగ కరుణ వారధి నీయుమా,
    వ్యాధి బాధల ఘోరపీడల మనసు మరలగ జేయకా,
    నిఖిల జగముల నిండియుండి నిన్ను గానగ జేయుమా!
    కరుణ మానకే కాళికా ఇక మిన్నకుండుట మానవే,
    మహాగ్రాసవు మహా శనవు మన్ననెంచవె నన్నిక !

Leave a comment