అలసినా మమ్మా

అమ్మ! ఉనికంటూ ఉంది అంటే, ఒక అమ్మ ఉంది అని అర్ధం. కానీ, అయోమయంగా ఉన్న నా ఉనికికి అర్ధం తెలియటం లేదు. నాకు తెలియనంత మాత్రాన, అర్ధం లేదు అనుకోవటం వివేకం కాదు. అందుకని, ఆ అమ్మనే అడిగాలనుకుంటున్నా….

పుట్టుటెరుగని వాడు మొలిపించె నీ జగతి,
పురుడెరుంగని తల్లి లాలించె నీ జగతి,
పంతాన పలుమారు సవరించె ఈ రూపు,
దిశకొక్క తలగల్గు తొలిసంతు శోధింప!

ఏల పుట్టితినంచు ఎలుగెత్తి అరచినా,
ఏటికీ జగతంచు జగమెల్ల అడిగినా,
ఏనాడు తుదియంచు పలుమారు వేడినా,
ఏబదులు వినరాదు వినువారుకరువేమొ!

దిక్కుకో తలగల్గి దినమంత శ్రమనొంది,
దిద్ది దిద్దీ బొమ్మ ఏమంచు సృజియించు?
పలుక నేర్చిన బొమ్మ పలికేటి పలుకులకు,
బదులు పలుకని తెలివి నేమంచు వివరింతు?

మనోబుధ్యహంకార పలు వాసనల వ్రేల్చి,
కర్మ జ్ఞానేంద్రియములన్న సొమ్ములన్ని దిద్ది, మరువ నెరుగని మనసు రౌతుగా అమరించి,
నుదుటి రాతను రాసి పురిగొల్పి పంపేను!

కునుకు దీరని తండ్రి కల కల్పనల జాడ,
కల్పించి కొలువున్న జగమన్న జాలమున,
క్రిందు మీదగు బొమ్మ మనసు వేదనజూచి,
కునుకెరుంగని కనులు మురిపాన మునిగేన?

నాడునేడుల సంధి సంధించినీ నడవ,
నిలకడెరుగని నడక నెమ్మదెరుగని మనసు,
నిలువరించెడి వాని లోనె పదిలముజేసి,
లోనికరిగెడి దారి తెలుప మరచెను ధాత!

నాటి చేతల ఛాయ నడిపించు దారిలో,
నిలకడెరుగని భవిత మురిపించు మెరుపులో,
పదము నిలచిన తావు నిలకడెంచని మేధ,
మరల ఏమరచేను లోదారి మరచేను!

బహు హారముల భారమవలీలగా మోయు,
దొడ్డ వక్షమునందు కొలువున్న నా తల్లి,
కోరికెరుగని వాని పెనిమిటని గలిగుండి,
కోరికల ఊపిరుల సంతు నొందితివేల?

కోరి అరిగితి మంచు కొరగాని కొలువిచ్చి,
కఠిన పధమున మమ్ము పలుమారు మరలించి,
పొల్లు చేతల పనులు చేసినామని తలచి,
పలుమారు సవరించు తొలి సంతు సవరించు!

తొలిసంతు తమకాన ప్రేమ మీరగ తలచి,
ఆట బొమ్మల మంచు అందజేసితి వమ్మ!
ఆట అదుపును తప్పి వేట దారుల నడిచె,
ఆదుకొని మమ్మింక అలుపు తీర్చుము తల్లి!

ఆదరింపగ మాకు నీవు కాకింకెవరు?
అంధకారపు పొరల ప్రేమతో తొలగించు,
అంతరంగపు తలుపు తగురీతి తెరచుకొని,
అంది మము ఆదరపు అంబుధిన వెలయించు! అమ్మ!అమ్మ!అమ్మ!

Leave a comment