సావిత్రి – నా మాటల్లో

Master CVV గారి శిష్యులైన శ్రీ రామకోటయ్యగారు, శ్రీ అరవిందులు English లో రచించిన “సావిత్రి” ని , అనుభూతి పూర్వకంగా తెలిగించారు. ఈ రెండు గ్రంధాలూ , దేనికదే ప్రత్యేకమైనవి. ఆ రెంటినీ సామాన్యులు అర్ధం చేసుకోడానికి శ్రీమతి వరలక్ష్మి (మా అక్క) చేసిన ప్రయత్నమే, “సావిత్రి ధారావాహిక”. దాన్ని వినగా, నాకు తోచిన సావిత్రి ….

చ్యుతి నెరుంగని వాడు చింతించినీ జగతి,
స్మ్రతుల కల్పన జేయు జనని నెరపిన జగతి,
సృతి మరచి చితియందు చిన్నబోవుట జూచి,
చింత మాపగ తలచి తనువు తోడగ తలచె!

మయుడెరుంగని యట్టి మందార వరమాల,
మదన జనకుని ఇంతి ముదముతో చేబూని,
మధుప ఝుంకారముల సృతిగీత నుతులతో,
దేహి తోడగు “వాని” ధారణందున మెలచె!

ఆది నుండియు తానె ఆదిత్యు వెలిగించి,
రోహిణీ పతి మోము ముదమార వెలిగించి,
చంద్రికై చరియించి ఓషధుల వెలయించి,
వెల్లి విరిసే వెలుగు విడలేని తోడాయె!

ఏలు నియమము మరచి నలిగిపోయెడి వాని,
ఏల చింతన యంచు మరలించగా నెంచి,
ఎన్ని నిలకడ దెలిపి నియమ మమరగజేసి,
ఎగువ దారుల నడుప ఏమరక జతజేరె!

ఉదయ కిరణము కన్న ముందుగా కనువిప్పి,
ఉదయించు కిరణాల ఉత్సాహమును పొంది,
ఊహమరచిన ఉనికి ఉచ్చు విప్పగ నెంచి,
ఊరడింపుగ తాను తనువు తోడుగ నడచె!

జారిపోయెడి తెలివి జేరి చక్కనజేసి,
జర జేర వెనుకాడు తనువు నందగజేసి,
జగము జేరిన నాటి ఈప్సితము నెరిగించి,
జగము నేలుమనంచు తోడుండ తరలింది!

జగమేల వలెగాని జగము నొందగ రాదు,
మనసు మడుగున మనిగి మతితప్పి మనరాదు,
ఫలము నొందగనెంచి పలు విధుల జనరాదు,
పాప చింతన మరచి ఫలమెంచ సరిగాదు!

జగతి మాయలమోహ మింతింత యనరాదు,
మోహమును తెగనాడు దారులే కనరావు,
మునిగి మోహమునందు మోహమొసగిన వాని,
మదినెంచి మనవలయు త్రిపురారి గనవలయు!

జాగరూకత నొంది జతయైన జతగాడు,
ఎన్ని ఎరిగించేటి ఎరుక వివరము నెరిగి,
మనసు మడుగున మునిగి మౌన భావననెరిగి,
ఒదిగి ఆ జతగాని జతనంది మనవలయు!

మితి నెరుంగని వాని మతియందు గలిగున్న,
మితి మరచి మననెంచు మతి ఏలెడీ తనవు,
సంగమందలి సుధను సావకాశము మరచి,
ఆదరంబున నెంచి అనుదినము సేవించు!

తొలుత మొలచిన అట్టి ఒక మొలక జగతాయె,
తొందరొందిన నాటి మితి నేడు విడిపోయె!
ఎల్ల లెరుగని ఎరుక ఉల్లము మందుదయింప,
మాసిపో నొక ఉనికి సంతరించుక సాగు!

అలుపెరుంగని రధము అమరించుకొని నీవు,
జగతి జయ యాత్రగా సాగించు నీ రధము,
ఎల్ల లన్నియు చెరిగి వ్యాపించెనీ జగము,
అణువణువు శోధించి నిన్ను నీవే గనుము!

నీవు కానే అణువు ఎచ్చోట కనరాదు,
కనగల్గు కణమెల్ల కలిగియుంటివి నీవు,
నిండి జగములనెల్ల నిలువరించెడి నీవు,
చెలగి చేతన యగుచు మురియు మోదాన!

Leave a comment