జాలి ఇంచుక లేక తనువు తా జారంగ,
అంబరపు చేయంద తరలిపోయే దెవరు?
తనువు జారకముందు బంధు బంధాలలో,
తెరపెరుంగక తగిలి తల్లడిల్లే దెవరు?
|| ఎవ్వరో ‘అది’ ఎవ్వరో! ఎవ్వరో ‘అది’ ఎవ్వరో!||
కుడుచు అన్నంబొకటే కూడు ఊపిరి యొకటె,
నీరు నిప్పులు యొకటె ధరణీతలంబది యొకటె,
తనువు తనువున జేరు పంచభూతములొకటె,
తనువు తలపుల భేద మమరించునది ఎవరు?
|| ఎవ్వరో ‘అది’ ఎవ్వరో! ఎవ్వరో ‘అది’ ఎవ్వరో!||
తరువులన్నిట తగులు ధరణీతలంబొకటె,
ధరణి ధరియించేటి ఆకాశమును ఒకటె,
చినుకులై చిందేటి నీటి తుంపరలొకటె,
తరువు తరువున భేద మమరించునది ఎవరు?
|| ఎవ్వరో ‘అది’ ఎవ్వరో! ఎవ్వరో ‘అది’ ఎవ్వరో!||
తనువులో తరువులో తగిలున్న వాడెవడు?
సహపంక్తి భుజియించి భేదమొందే దెవరు?
సంగమందలి సంగమొల్ల నెంచేదెవరు?
బదులెరుంగని ప్రశ్న వివరించగా నెరవు?
|| ఎవ్వరో ‘అది’ ఎవ్వరో! ఎవ్వరో ‘అది’ ఎవ్వరో!||
చింతించవే మనస చింత చెదిరే దాక,
చింత దీర్చెడి వారు చేరువయ్యే దాక,
చేరవచ్చిన గురుని గురుతులందేదాక,
గురుపాద సన్నిధిన మనసు నిలిచేదాక!