తనువిచ్చినా తనువు తరలిపోయే రోజు,
తలపులెన్నో పొంగి తనువంత తడిపేను,
తలనిమిరి లాలించి లాలపోసిన చేయి,
చితిమంట చిటపటన చిన్నబోయిన రోజు!
గోరుముద్దలు కుడిపి దుడుకు దండనలిచ్చి,
కాననంటిది జగము దిక్కుదారులు లేవు,
నాకమేలెడివాని మనము నెంచుమనంచు ,
బ్రతుకు బాటల వెంట పయనించగా నంపె!
సావకాశంబేదొ సావధానంబేదొ వివరించ నెంచకే,
పలుతెరంగుల పరచు జగతి జిగి దారులన
విధి తెలుపు వివరములు మదినాటు నని తలచి,
వినువీధి వాసులను వేడుమని మరలెనో!
వాదులాడిన నాడు వారించ మరచేను,
వాదమందున నిలచి వివరముల నెంచేను,
బ్రతుకు వరదన నిలచు తావెంచకే నేను,
తరలి తీరగు గట్టు తగులుమని తెలిపేను!
జోలపాటలు చాటు బ్రతుకుబాటల నీటు,
నిదుర మబ్బుల మాటు మగతగా మిగిలేను,
మగత తీరిన నాడు నాటి నీతులు పాట,
జోలలూగుచు నన్ను జాలిగా చూసేను!
తనువు చెల్లిన నాడు చెలిమెంచి చేరునో,
చెల్లిపోయిన చెలిమి చెదిరి చితి చేరునో,
మరపెరుంగని ఊహ ఉయ్యాల ఊపులో.
ఊరడింపుల పాట ఉనికి ఊపిరి పోదు!