కావుమమ్మా

             భవ పావకము నార్పు వృష్టి నొసగెడి దృష్టి 
             మా దెశను సంధించి మము బ్రోవు మమ్మా!
             భీతిగొని యున్నాము భవదీయులము మేము,
             మాతరో మరుగేల దరిజేర్చు కొమ్మా!             

             సామగానపు గతుల సారంబటీ జగతి ,
             సామగానాలోల జాలమేల?
             సారహీనంబాయె తరిదారి కరువాయె,
             సావకాశము దీరి దరిజేర్చవమ్మా!

            పాపా కానన నడుమ కదలేకున్నాము,
           చిక్కనగు ఈ వనిన చిక్కుకొని యున్నాము,
           పావకంబైనీవు కడదేర్చి ఈ వనిని,
           చల్లనగు నీ చూపు మా శిరమునుంచు!

           హీనభాగ్యపు పొంగు అంబరంబంటేను,
           నలుదెశల కమ్ముకొని చీకటులు చిమ్మేను,
           పొంగు నార్చగగలుగు హోరు వీచిక నీవు,  
           ఉప్పొంగు అలభంగి ఉరికి గడి దీర్చు!   

          మోహ బంధము జిక్కి భీతిగొందీ మనసు,
           భవ పాశములు బిగిసి శమియించెనీ బ్రతుకు,   
          తెరపెరుగనీ రోగ బాధలను బాపుమా,
          అతులితంబగు అభయ అరకిచ్చి బ్రోవుమా! 

           తారకంబగు తరిని తెలచి మెలగకముందె, 
           తరలి పోవగనెంచె తనువు జీవములెల్ల
           తెలివిలో నిను నిలుపు తేజంబునీయవే, 
           రమ్యలోచన నన్ను  కనులందు నిలిపి! 

Leave a comment