పట్టు కోకలు కట్టి పాయసాన్నము బెట్టి,
పలుమారు వేడినా వినదాయె చిలుకా,
పొలిమేర నే దాటి జంటనుండ ననంచు,
అలిగి తొలుగగ నెంచు అది ఏమి వింత?
నాకమందలి నగరి నాణ్యమని ఎంచేను,
పున్నెముల పోగులా పురవాసు లని ఎంచు,
పగలూ రేయీ దాని సొగసులే తలచేను,
తరలి పోదమనంటె పొలిమేరె బరియంది!
పలుకు పలుకుల నెల్ల పలవరించే సీమ, కనులు కను కలలోన విందుజేసే సీమ,
చెమట చినుకుల ఫలము చిన్నబోయే సీమ,
చేర పోదమనంటే సీమ దాటననంది!!
పండుగలు పర్వాలు పుణ్యనది స్నానాలు,
కుడుపు మాపుక జేయు పూజాది యాగాలు,
దానాలు దక్షిణలు దండ ప్రణామాలు,
కటిక పడకల నోము కాలి నడకల బాస,
నిదుర దూరము జేసి తలపు నిలిపిన రేయి,
క్రమము తప్పక చేసి కోరినా సురసీమ,
చేరబోవగ బిలువ చెదరి మరుగయ్యేను!
గాలి బుడగన జేరి తెరపు మరపులు తరచి ,
వింతలోకపు మెరపు వివరమెంచగ నెంచి,
పుణికి పున్నెములన్ని పోతబోసితి ననంచు,
మోహపడితిని గాని భువితీరు గననైతి!!
సీమ దాటని సఖిుని చెలియగానెన్నుకుని,
మీరి మక్కువ జూపి భేదభావము మరచి,
తాను అల్లిన కలను తానె యని తలపోసి
మోహపడినా తప్పు తానె తెలియగ వలయు!
సెలవు నీకిక చెలియ చెల్లిపోయెను చెలిమి,
చెదరిపోయిన కలవు చెరగుటెరుగని భ్రమవు,
తరుగెన్నతగనట్టి తీపి తలపుల మోపు ,
మూపు నందుక మరలి సీమ దాటెదనింక!!