సోమశేఖరు చెలియ శోధించకే నన్ను ,
సకలార్తిహరి నిన్నే శరణంటి నేను ,
ముక్కంటి చూపులకు మేను బాసినవాడు,
దుడుకు దాడుల దునిమె మనసు నిలకడను!
పెరుగు తరుగెన్ననా పూర్ణకాముని శిఖన,
దివి కన్య మెట్టినా ముడి మడుగు పైన,
వాడుటెరుగని వెల్గు వన్నె వైభవమొంది,
భాసించు వాడదియె నాడె గగనమునా!
భవతాపహరు శిఖిన భవతారిణీ జతగ,
నిలచి నేర్చిన విద్య మించి మెరయంగా,
తరగు మెరగులమధ్య పూర్ణుడై ఆ రేడు,
పూచె గగనపు తోట ఇల వనులు మురియ!
వదలి వాంఛలనెల్ల వేచి నిలచిన ఋషులు,
చెలుని సంగమునంద వేచి వగచెడి చెలులు,
కురియు చల్లని వెలుగె ప్రాణధారగు కలువ,
విందునందగా కురిసె చంద్రికిల నేడు!!
హృదికొలను కమలాల కనులు మెరయంగా,
నాడి నడకలు మరచి నిలచి నివ్వెర నిండ,
మాడునాడెడి నాడి మరచి నాకము జూడ,
జారెనే ఒక చినుకు జర బెదిరి చెదర!
నాడు గోపకు కొలచి రమణులందిన చినుకు,
శుద్ధోధనుని పట్టి బ్రతుకు చిగురగు చినుకు,
చెలికాని చెరణాలు విజయు కొసగిన చినుకు, విందుగా నందుమని చిలికె తారల రేడు!
కామంతు శిఖినుండి కురియు కౌముది నేడు,
కడతేర్చదే కామ కలిక కుదురుల పొదను,
పొరలజేయవె నీదు కరుణ చూపుల తూపు,
రతివల్లభుని రధము ధరకూలు నటుల!!
సోమశేఖరు చెలియ శోధనెంచుట మాని,
చేరబిలువవె నన్ను చెరబాపి ఇకనైన,
చేతులారగ నీకు సేవలందగ జేయ,
పసలేని ఈ పురిని పుణికి గైకొనవే!!