పురిటి కందును జూచి పున్నెముల ప్రోవంచు,
పురిటి నెప్పులు మరచె పిచ్చి తల్లి!
కుడుపు కుడువక బిడ్డ మారాము జేసితే,
కడుపు కట్టుక కుడిపె మాపి కినుక!
నడక నేర్చే రోజు తూలినడుగుల వెంట,
తూకమై తానొంగె మురిపెమెంచి!
ముద్దు పలుకులలోన పిలుపు నందుక తాను,
పులకించి పలుమారు పలవరించె!
బ్రతుకు బాటలవెంట పయనించు పసితనము,
ఆట పాటల బాట బ్రతుకు బాటని ఎంచు,
పసిమనసు పంతాల మనుప శక్యము గాక,
మనసు ఆరడినాప కొలనైన కనులందు,
కొసరి మురిపెము నింప పంతములనాడె!
బ్రతుకు బాటలవెంట పయనమందే వేళ,
దిగులు తగదని తెలిపి రేపు మెరుగని పలికి,
దీవెనలు కురియుమని దేవగణముల వేడి,
నీ బ్రతుకు నీడలకు నా ఒడియె చోటంది!
వసతి వన్నెల వెలుగు పెరిగి తరిగే వేళ,
నలిగి పొగిలిన మనసు మన్ననెంచని వేళ,
తీరు మరచిన బ్రతుకు భారమెంచిన సంతు,
సంకటపు సుడి జూచి మనసు కృంగగ నెంచె!
కాలమంటిన తనువు కాటిబాటన నడిచె,
దుడుకు దారుల నలిగి సంతు దూరమునెంచె,
ఆదరంబెంచ ఇట ఇరుగు పొరుగులు లేరు,
చెరబాపి తెరవిచ్చి చేరదీయవె తల్లి! కల్పవల్లి!!