నేటి భాగ్యము

అంబుజాప్తుండదిగో ఉదయగరి చేరేను,
పదిలంబుగా నంది భవుని సందేశంబు,
భువి జీవులకు నేటి నడత తీరెరిగింప,
వెలుగు కన్నులు పరచి వెదకి కబురీయంగ!

వాదనలు వేదనలు వేద విదురుల నుతులు,
నిత్య నైవేద్యాలు నిలకడెంచని మతులు,
మాటు జేరని విధులు మాట చెల్లని గతులు,
వివరముల దొంతులను ఎంచి కూర్చిన పంక్తి,
అందుకొండిదె యంచు అరిగె వెలుగుల రేడు!!

తనువు తిన్నగ లేని సారధందిన రథము
సప్తాశ్వములు గుంజు ఒంటి చక్రపు రథము,
దిశలు దిక్కులు లేని గగన తలమున దారి,
వెలుగు రెక్కలు పరచి సేవించు పరిజనులు,
సరి వాసముల నెరుగ వసతొంద జేయునట!!

నేడె కన్నులు తెరయు చిగురు ప్రాణులనైన,
చెల్లి ఆయువు తరలు జీవ జంతువులైన,
వోడి వైరులపంచ వగచు దుఃఖితులైన ,
ఇంద్ర వైభవమందు ధరణీశు సతులైన ,
జంకు నెంచని రేడు తరలె ఆనతందగ జేయ!!

కబురంద వెనుకాడి మరల రమ్మన వినడు,
కొసరి కాలముకొంత గడిపి కనుమన కనడు,
మమత తీరని కనులు మాలిమెంచని కలలు,
నిలువరింపుమనన్న నిలువడే నిముషమును,
నిజవాస నాయకుని సెలవు జీవి దరి జేర్చ !!

దివి దేవతలు వాని నిలవరింపరె నేడు,
ఓప ఓపికలేక ఒరిగి యుందొక ముదిత ,
ఇలవేల్పులకు విరులు ఒలికించు విరిబాల,
బేలగా ననుజూసి జాలికబురులు కురిసె,
సేదతీర్తును కొంత సేవింతునింకొంత ,
నియతి నియమము తెలిపి ఓరిమొంద !!

.

Leave a comment