నీడ

తగిలి తనువును తాను నడిచేటి నా నీడ,
తొందరొందుచు నేడు తనువులో లయమాయె, తాను తన నీడన్న ద్వంద్వంబు తరగించి,
తానొక్కడే నిలచు తరుణంబు మొదలాయె!

తనవులో కొలువున్న కోవెలందున నిలచి,
నియతి నియమము మేర తగులీల సాగించు,
తనువాసి తోడొంద తనువువెంటనె నడచి,
తుది అడుగుగా తాను జతనందె ఈ నాడు!

తానన్న ఉనికంది తనువులో చేరుండి,
తెరచి తలుపులు తాను లోనండి రమ్మన్న,
వెన్నంటుటేగాని వెడలి చేరగ లేక,
అలుపెరంగక అంటి వెంట నడిచే నీడ!

ఆడినా పాడినా ఆటలో అలసినా,
మోదాన మునిగినా ఖేదాన ఒరిగినా,
సాటివారని అంటి వెంట ఎవరున్నా,
మౌనంబె భాషగా జంటవిడువని నీడ!

తెరపు మరపుల తీరు ఎరిగున్న నా నీడ,
తెరపైన మరుపైన తోడు విడువని నీడ,
తోడు విలువను ఎరిగి ఒరిగి ఒదిగే నీడ,
తనువందు తరినుండి తోడైన నా నీడ!

నేడలసి నాలోన కరిగి మరుగున జేరె!
తనుభార మీనాడు తరిగి తూనిక దీరె! (తూనిక – గౌరవము)
వీసమంతగు తనువు పెరిగి మోపుగమారి,
పెరిగి పెరిగీ విరిగి నీడలో లయమాయె!

నేనె నీడగ మారి మాసిపోతిన నందా?
నీడ నాలోజేర వెలిగి పోతిన నందా?
తనువున్న ఆ నాడు తోడు నడచిన నీడ,
చెల్లిపోయెను తాను తనువు తోడుగ నేడు!!

Leave a comment