రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన ఒక కవిత చదివిన స్పందన – ఈ ….
తనువు రాలిన నాడు తలుప నెంచెడి వారు,
తలుపరే నన్నిపుడు తెలిసి నే మురియా!!
తీపి మాటలు పల్కి పొగిడి పొంగెడి వారు,
పలుకరే ఆ మాట నా మనసు నిండా!
చూపు కన్నుల వీడి కనలేక యున్నపుడు,
వన్నె వన్నెల పూల విరిదండ లేలయ్య!
కంటిలో దీపంబు కదలాడు చున్నపుడె,
చిన్ని పూవును పంపి ప్రేమ తెల్పగరాద!!
నాద మందగ లేక చెవులు చితికిన నాడు,
మంచి మాటల మూట మన్న నేలయనాకు!
ఆ మూటనొక మాట నేడె పలుకగ రాద,
వీనులందగ జేయ విని నేను మురియా!!
నేల రాలిన తనువు తరలిపోయే నాడు,
తనువంటి నడిచినా తోడెరుంగనె నేను!
చెలిమిలో చేరువను చవిచూచి నే మురియ
తనువు తూలక ముందె అడుగు కలుపగ రాద!
కలసి నడచిన-బ్రతుకు, పలుకరించిన-చెలిమి,
చేరికెంచిన హితులె సంస్కృతుల సంగమము,
సంగమించిన హితమె భువిన బహు భాగ్యంబు,
భాగ్యముల పొంగులే భవిత కర దీపములు!!
నాటి తలపులనెల్ల పలుకు మాలల నుంచి,
బ్రతుకు బాటన కొంత సావకాశము నెంచి,
తలవైపు దీపముల వెలుగు విరియకముందె,
తలుపరే నన్నిపుడె నా కనులు మెరయా!!