చల్లగాలుల చెలిమి నొందుచు- చిందులేసే యమున అలలకు,
మురిసి ముచ్చట గొన్న పొన్నల – చిన్ని నర్తన గన్న గొల్లడు,
అంది వెదురును మోవిమౌనపు శ్వాసనూదుచు మురియు వేళన,
మోహనాంగుని మదిన మెదిలెడి నోములను ఏకాంత నోచెనో!!
వల్లభుల విడనాడి వనితలు వెన్నెలల వెలుగంది కదులుచు,
విరుల మించిన సౌకుమార్యపు సొమ్ములన శృంగారమెంచుక,
పరచి పరువము ఏలుకొమ్మని పాదముల తమ తనువు నుంచగ,
కబురు నందని నందనందను కబురు నందేకాంత నోచెనొ!!
పద్మబాంధవు పలుకునెంచక తలను వాల్చిన కలువ బాలను,
పలుకరించగ రేణుకాపతి కుమ్మరించిన చెలిమి చినుకులు,
చింది జగముల జోలలూపగ చిగురునందిన చెలియ కన్నుల,
కాంచనెంచని కామజనకుని కనుల నిండేకాంత నోచెనో!
గుమ్మపాలను మించు కమ్మని కోమలత్వపు కోకగట్టిన,
విరుల వన్నెలు తెల్లబోయెడి మేని వన్నెల గొల్లభామల,
కాలిజాడల జాడనందుచు కదలి వచ్చిన లేగ దూడల,
చేరదీయని చెన్నకేశవు చెలిమినందే కాంత నోచెనో!!
పొన్నకొమ్మల రెమ్మలందున నిదుర లేచిన పూలకొమ్మవు,
పొంచి కొంచెము ఎంచ నెంచవె కొమ్మనూగెడి గొల్లమనసును!
నోచనెంతునె నియమమున (నే)నా నోము నిత్యము వానికై,
కాన నెంచక వాని కన్నులు కనగ తగునే నాదు కన్నులు?
నూత్నశోభల శోభ పెంచెడి మార్దవంబుల పుణికి పొందిన,
విరుల చెండున అమరి తీరుగ వాని యదపై దొరలు బాలా,
గుండె లయలకు లయల నొసగెడి గోపబాలుని మదిన నిండిన,
మాని నెంచిన నోము వివరము వీనులెంచిక తెలుపవే!!
జగతి కూపిరులూదు ఉరమున ఊయలూగెడి చలనమా,
చేరి మోవిన గానమై భువి కలత మాపెడి ప్రాణమా!!
కొసరి కొంచెము ఎంచి ఎరుగవే అంతరంగపు గుట్టును,
పట్టి దానిని పొందగా నే పరమపావను పొందునూ!
మాధవుని పెదవంది మురిసెడి వెదురు కొమ్మల బాలికా,
జాలువారెడి మౌనభాషకు భావనడతల హొయలు నద్దెడి,
ఒడుపులో ఒదిగున్న రమ్యత రంగరించిన నిగమ మంత్రము,
అంది నాకిక అందజేయవె అంది మాధవు నందగా!!
మౌనమొందగ తగునా మీరిటు మన్ననెంచక నామొరా!
మనగ జాలదె నాదు తనువిక తలచి మాధవు చేరిక!
చెలిమి తరగిన చెలియనై నే నిలను నిలువగ నొల్లనే!!
చేరి చెలువము నొందువారల చేరికోర్వగ నేరనే!!
ఒంటరై నే నలమటించగ ఓరిమెంచు మనందురా?
జంటజేరగ నిగమవాసుని ఎంచ నేరమనందురా?
మాధవుని మదినంటి యుండిన జంటజాడల నెంచరే!
చెదర నెంచని మదనమోహను మనసుపొందగ నెంచరే!!
తెరపు మరపుల తనువు దారుల తరలనెంచెడి రాధికా!
తెరచి తలపుల తొంగిజూడుము తొలగిపోవగ నీ వ్యధా!
తనువు చెదరిన జగతి చెదురును మిగులు మౌనమె హాయిగా!
మౌన కాంతుల కరిగి ఒంటరి జంటయౌ నేకాంతగా!!
ఏకాంత వాసుని ఏలికౌ ఆ దాంతి ఏలిక నొందగా,
(దాంతి : ఇంద్రియనిగ్రహము. బ్రహ్మచెర్యాది తపఃక్లేశమునోర్చుతనము)
ఒదిగి నీ యద మరులు పంచగ మరలివత్తువనెంచుచూ,
మౌనమందే ఎదురు జూచెడి యదుకులోత్తము నెరుగుమా!
కరుగు కాలము కరుగ నెంచని కణికవై వెలుగొందుమా!!