చిలికి చీకటి వెలుగు వెన్నను – అంద నెంచెడి ఆశలు!
చీలి పోయెడి దారి కొమ్మలు – తెలియ జేయునె గమ్యము?
చిటికెడంతీ బ్రతుకు ముంతన – జగతి పట్టగ వాంఛలు!
చేర వచ్చెడి చెలియ మిత్తిని – మిధ్యనెంచెడి మోహము!!
వెలుగు వాకల వన్నె తెలుపగ – కటిక చీకటి కనుల గట్టదె!
ఆవరించుక దారులన్నిట దాచియుంచదె యున్న సత్తును,
సావకాశము కొంత ఎంచుక ఎరుగ నెంచిన సాధుజనులకు,
సానుకూలపు తరుణమెంచుక తెరపి కొంతగ నందజేయదె!
తొంగి చూసిన వెలుగు వాకల మెరుపులో మైమరచు దేహులు,
కాల గమనము మరచి నిలవగ నిలచి నిశ్చలమైన కాలము ,
కదలు కాలపు చెలిమి మరచిన చెలనమెంచని కాల కణికలు,
మరువ జాలని మణులు మూటల మొలకలై మతి పెంచవే!
ధరణి సారము కుడుచు మతులన జేరినా మణి మొలకలు,
రెమ్మన రెమ్మన కొమ్మ లందుచు విస్తరించెడి ఊహ పుంతలు,
పంతమింతయు తరుగ నెంచక పయన మందవె గగన సీమకు,
పయన మొందగ నెంచు దారులు సీమ వివరము నెరుకజేయవు!!
అంది దారుల అందమేమని మురిసి ముందుకు సాగినామని,
అలసి అగిన చోటు నిలబడి ముందు నడచిన దారిజూడగ,
అడుగు కదిలిన ఉనికి ఏదీ లేశమంతయు కానరాదయె!!
చిట్టి బతుకుల పొట్టి నడకలు పట్టగలవే పరమ పథమును?
ఆదరించిన వెలుగు మడుగులు అరమరెంచవు చేరదీయగ,
చేదుకొమ్మని చేరరమ్మని చెల్లజేసుక అహమునంతయు,
ఆదుకొమ్మని అలసినానని పంతమాడుట పాడిగాదని.
మౌనమున శరణంచు వేడిన కాలవాహిని నిలచిపోవును
కటిక చీకటి చెరగు కరిగిక వెల్గు వాకలు పొంగి పొరలును!!
అమర ప్రేమే ఆసనముగా ఆదరించగ వేచియుండగ,
వెరపు నందుచు అంతరంగుని ఆదరంబును మరతువా?
వెలుగు నీడల జాడలందుచు వేదనల నలగఁగ తగునా?
చీకటుల చిలకంగ వలెనా? వెలుగు వెన్నల నొందగా!!