https://amritmahotsav.nic.in/lori-thankyou.htm?380925
నిదురపో నా తల్లి నిదురపోవమ్మా!!
వీరభారతి కధల జోల పాడేను!
జో – జో –జో – జో!!
మణులు మాణిక్యాల రాసి ఈ భూమి,
తరుగు ఎరుగని నిధుల ఊట ఈ భూమి,
ఈసుగొని పగవారు దోచనిటు రాగా,
వీరపుత్రుల గన్న జనని ఈ భూమి!!
జో – జో –జో – జో!!
నిదురపో నా తల్లి నిదురపోవమ్మా!!
వీరభారతి కధల జోల పాడేను!
భరతుడేలిన భూమి – గంగపుట్టిన భూమి,
నాల్గువేదములచే వెలుగొందినీ భూమి,
హితము గోరుటెగాని ద్వేషమెరుగని భూమి,
హింస తగదని తెలిపి జయమునొందిన భూమి!!
జో – జో –జో – జో!!
నిదురపో నా తల్లి నిదురపోవమ్మా!!
వీరభారతి కధల జోల పాడేను!
శరణన్న పగవాని శరణొసంగెడి భూమి,
శాంతి సాధనయందె ప్రగతినొందెడి భూమి,
సకలజన సౌభాగ్య తలపు గలిగిన భూమి,
భాగ్యరాసుల పెంచు తల్లులకు ఇది తల్లి!!
జో – జో –జో – జో!!
నిదురపో నా తల్లి నిదురపోవమ్మా!!
వీరభారతి కధల జోల పాడేను!
ఘన చరిత కలిగున్న పుడమి పుట్టావు,
పలు యశంబుల దారి నడువ వలెనమ్మా!
నాటి గాధలమించు మేటి చరరితలు దీర్చి,
భరత దేశపు ఖ్యాతి దశదిశల చాటూ!!
జో – జో –జో – జో!!
నిదురపో నా తల్లి నిదురపోవమ్మా!!
వీరభారతి కధల జోల పాడేను!