ఏమి సేతునొ నేను

పలుకులొలికే తనువు పలుకు మరచిన వేళ,
మదిన భావములన్నీ భాష మరచిన వేళ,
నేను నేనని తలచు ఉనికి కరిగిన వేళ,
ఏమి సేతునొ నేను – నేనైన నేను!!

రంగు రంగుల జగతి రెప్పచాటున జేరి,
అంతరంగపు గుడిన అణగి పోయిన వేళ,
చూచు దానిని చూపు చూపు కరిగిన వేళ,
ఏమి సేతునొ నేను – నేనైన నేను!!

  మధుర గానపు రవళి ముదమార పొంగినా,
  వీనులెందుకొ దాని వినిపొంగవీనాడు,
  తాటంకముల కొలువు తళుకు వీడిన వేళ,
 ఏమి సేతునొ నేను - నేనైన నేను!!

 అగరు చందన గంధ మెంతెంత చేరినా,
 ఘ్రాణ గ్రంధులు నేడు మన్నించకున్నాయి,
 కినుక గొని పవనుండు చలనమందని వేళ,
 ఏమి సేతునొ నేను - నేనైన నేను!!

  కన్న కూనలు తగుల పులకించు ఈ  తనువు,                                                                                                          
  కన్న వారిని తానె తలుప మరచిన వేళ,
  కరకు కొయ్యల శెయ్య  సొంపు గమరిన వేళ,
  ఏమి సేతునొ నేను - నేనైన నేను!!

 చేతలుడిగిన నాడు నేనేమి సేతునని,
 నేటి చేతన మరచి చింతనొందట మాని,
 నగుమోము గల వాని పలుమారు పొగడుచూ,
 నేనైన నా ఉనికి నేనెరుగ నెంతూ!





                       

Leave a comment