గాలి బుడగ

 గురు పూర్ణిమ శుభాకాంక్షలతో…..

గాలి నిండిన నీటి పొర అది – ఆకశంబున తేలెనే!
గగన మందలి వెలుగు లానగ – వింత శోభల వెలిగెనే!
సూర్యచంద్రుల సాటిగా తన వెలుగులంచూ తలచెనే!
గగన సీమల దారులందున దొరలి తరలుచు మురిసెనే!!

బాల భానుని తరుణ కిరణపు అరుణిమల వెలుగొందుచూ,
ఉదయ భామిని కంఠహారపు కెంపు తానని తలచెనే!
ఉషా సుందరి పాపటిన సింధూర సొగసుల వెలుగులో,
మునక లేయుచు మురిసి పోవుచు చెంగావి చినుకై తెలెనే!!

పుత్తడిన పొదిగున్న మణులతొ వెలుగు లీనెడి మకుటము,
శిరమునందిన దినకరుండట దివిన రధమున తరలగా,
జగతి నొలికిన పసిడి కాంతులు కొంత తనపై వాలగా,
తానె పుత్తడి ప్రోవు ఆయెని మిడిసి మురియుచు తేలెనే!!

గగన కుసుమపు పుప్పొడులు ఇటు ఒరిగెనేమని ఎంచుచూ,
నాకవాసపు పూల మధువుల మధురిమల మదినెంచుచూ,
రేకు విచ్చిన నేటి భాగ్యపు కుసుమముల కొనియాడుచూ,
గండు తుమ్మెద రెక్కలార్చుచు దాని నందగ ఎగిరెనే!!

చేర వచ్చెడి తుమ్మెదను తమకమున తా గాంచుచూ,
స్వచ్ఛమగు తన స్వేచ్ఛ సోయగ మెంచ నేరక పోయెనే!
వరదుడా నంద నందను ప్రేమ వీచిక నడత మానుక,
తనను మెచ్చెడి మురిపముల రుచి తలపులో తా తేలెనే!

మోహమొందిన తలపు బలిమిని తృుంచతగరే వేల్పులూ,
వాలిపోవరే వేల కల్పములందు దారుల వెదుకుచూ,
మోహనుండా మాయనాధుని మోహమందెడి దారిలో,
తరలు వారల తోడు జేర్చెడి గురుపదంబుల వాలదే!!

Leave a comment